Tuesday, October 15, 2013
Drs Chandu
సున్ని పిండి తయారు చేసుకునే పద్ధతి
సున్ని పిండి ఒక ఆరోగ్య సౌందర్య సాధనం.
శనగపిండి, పెసరపిండి వీటికి తోడు కచ్చూరాలని బజారులో దొరుకుతాయి వాటిని
కలిపి దంచుకుని, దీనికి కొద్దిగా షీకాయిపొడి కాని, కుంకుడు కాయ పొడి కాని
కలిపివాడుకోవచ్చు.
దీనిని నిత్యమూ వాడుకోవచ్చు. ఒళ్ళు రుద్దుకుని
నీళ్ళు పోసుకుంటే చర్మం నిగనిగ లాడుతుంది. తలంటు పోసుకున్నపుడు దీనిని
జుట్టుకు పట్టించి రుద్దుకుంటే బాగుంటుంది.
సున్నిపిండి కలిపేటపుడు కొద్దిగా మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసంతో తల రుద్దు కుంటే జిడ్డు తొందరగా వదులుతుంది.
తలంటు పోసుకునే ముందు ఒంటికి నూని రాసుకుని ఆ తరవాత తడిసిన సున్నిపిండి
రాసుకుని కొద్దిగా ఆరిన తరవాత స్నానం చేస్తే ఒంటినున్న మట్టి పోతుంది.
మట్టి శరీరం మీద చెమటతో కలిసి నల్లగా పేతుకుపోతుంది, ఇది పోవాలంటే, సబ్బు
వల్ల కాదు. ఈ మట్టి మూలంగా ఫంగస్ ఏర్పడి చర్మ వ్యాధులు కూడా రావచ్చు.
మగవారికి, అందునా ఒంటినిండా రోమాలున్నవారికి శుభ్రపరచు కోవటం కష్టం ,
అందుకు వారు నూనె రాసుకుని కొద్దిసేపు తర్వాత ఈ సున్నిపిండితో రుద్దుకుంటే
చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు సౌందర్యానికి సౌందర్యం !
Drs Chandu మెంతి ఔషధ గుణాలు #
ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ
మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతులలో ఔషధగుణాలనున్నాయని
చాలా మందికి తెలుసు.
మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు.
హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన
సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు
ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం
సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్, మధుమేహం
అదుపునకు ఇవి దోహదపడతాయి.
మెంతి ఆకుల ఔషధ గుణాలు #
* ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.
* పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
* కామెర్ల వచ్చిన వారికి, లివర్ సిర్రోసిస్ ( కాలేయ క్షయం)తో
బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి
త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్ సలహా మేరకు మందులు కూడా వాడాలి)
* ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
* ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.
* ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
* ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి.
మెంతి గింజలు #
* రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ
నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు,
అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో
బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)
* నీళ్ల
విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్) ఉన్నవారు
వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.
* కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
* పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి
ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి
వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
* మెంతి
గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా
తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం
తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
* మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
* మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన
వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో
శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర
చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న
వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.
100 గ్రాముల మెంతి గింజల్లో పోషక విలువలు #
పిండిపదార్థాలు 44.1 శాతంప్రోటీన్లు 26.2 శాతంకొవ్వు పదార్థాలు 5.8 శాతంఖనిజ లవణాలు 3 శాతంపీచు పదార్థం 7.2 శాతంతేమ 13.7 శాతం
కాల్షియం, పాస్పరస్, కెరోటిన్, థయమిన్, నియాసిన్ కూడా ఉంటాయి.
అరగడానికి రెండు గంటలు పడుతుంది. 333 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది.
మెంతి ఆకుల్లో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది.
100 గ్రాముల ఆకుల్లో పోషక విలువలు #
పిండి పదార్థాలు 60 శాతంప్రోటీన్లు 4.4 శాతంకొవ్వు పదార్థాలు 1 శాతంఖనిజ లవణాలు 1.5 శాతంపీచు పదార్థం 1.2 శాతం
మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి.
Drs Chandu ఆకుకూరలతో కలిగే మేలు
ఆకుకూరల్లో
పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి,
చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర,
మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
ఆకుకూరలు ఎక్కువగా
ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా
వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ
వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు
సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే
కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు
ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది.
దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో
కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.
ఆకుకూరలు పిల్లలకు విరేచనాలు కలిగిస్తాయనేది కొందరి అపోహ. ఈ కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలను ఆకుకూరల నుంచి దూరం చేస్తారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. నేల, నీరు ద్వార ఆకుకూరలను
సూక్ష్మక్రిములు (బాక్టీరియా), కీటకాలు కలుషితం చేస్తాయి. వీటిని శుభ్రం
చేయకుండా వినియోగిస్తే విరేచనాలు కలుగుతాయి. కనుక వినియోగించడానికి ముందు
ఆకుకూరలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వినియోగించినట్లయితే
ఎలాంటి రుగ్మతలు రాకుండా నివారించవచ్చు.
వండిన ఆకుకూరలను శిశువులకు
తినిపించే ముందు వాటిలో పీచు పదార్ధం లేకుండా జాగ్రత్తపడాలి. ఆకుకూరలను
వండిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి వడపోయడం ద్వారా పీచు పదార్ధాన్ని
తొలగించవచ్చు. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలోకానీ ఎక్కువసేపుగాని వండితే
ఆకుకూరల్లోని పోషకాలు నశిస్తాయి. వండిన తర్వాత మిగిలే నీటిని పారేయరాదు.
ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి. ఆకుకూరలను ఎండలో ఎండబెట్టరాదు.
అలాచేస్తే అందులోని కెరోటిన్ అనే పోషకం నశిస్తుంది. ఆకుకూరలను నూనెలో
వేపుడు చేయరాదు.
ఆకుకూరలు పోషకాల పరంగా అత్యంత శ్రేష్టమైనవి.అందరికి అవసరమైనవి.
ఆకుకూరల పెంపకాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి.తద్వారా ఇవి ఏడాది
పొడవునా అందుబాటులో ఉంటాయి.పెరటి తోట,ఇంటి డాబా పైన,పాఠశాలలోని తోట,ఆవరణ
లాంటి ప్రదేశాలు ఆకుకూరల పెంపకానికి అనువైనవి.మునగ చెట్టు,అవిసె చెట్టు
లాంటి వాటిని ఇంటి పెరట్లో నాటి పెంచినట్లయితే, వాటినుంచి ఆకులను సేకరించడం
సులువుగా ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)