Drs Chandu ఆకుకూరలతో కలిగే మేలు
ఆకుకూరల్లో
పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి,
చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర,
మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
ఆకుకూరలు ఎక్కువగా
ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా
వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ
వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు
సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే
కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు
ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది.
దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో
కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.
ఆకుకూరలు పిల్లలకు విరేచనాలు కలిగిస్తాయనేది కొందరి అపోహ. ఈ కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలను ఆకుకూరల నుంచి దూరం చేస్తారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. నేల, నీరు ద్వార ఆకుకూరలను
సూక్ష్మక్రిములు (బాక్టీరియా), కీటకాలు కలుషితం చేస్తాయి. వీటిని శుభ్రం
చేయకుండా వినియోగిస్తే విరేచనాలు కలుగుతాయి. కనుక వినియోగించడానికి ముందు
ఆకుకూరలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వినియోగించినట్లయితే
ఎలాంటి రుగ్మతలు రాకుండా నివారించవచ్చు.
వండిన ఆకుకూరలను శిశువులకు
తినిపించే ముందు వాటిలో పీచు పదార్ధం లేకుండా జాగ్రత్తపడాలి. ఆకుకూరలను
వండిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి వడపోయడం ద్వారా పీచు పదార్ధాన్ని
తొలగించవచ్చు. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలోకానీ ఎక్కువసేపుగాని వండితే
ఆకుకూరల్లోని పోషకాలు నశిస్తాయి. వండిన తర్వాత మిగిలే నీటిని పారేయరాదు.
ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి. ఆకుకూరలను ఎండలో ఎండబెట్టరాదు.
అలాచేస్తే అందులోని కెరోటిన్ అనే పోషకం నశిస్తుంది. ఆకుకూరలను నూనెలో
వేపుడు చేయరాదు.
ఆకుకూరలు పోషకాల పరంగా అత్యంత శ్రేష్టమైనవి.అందరికి అవసరమైనవి.
ఆకుకూరల పెంపకాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి.తద్వారా ఇవి ఏడాది
పొడవునా అందుబాటులో ఉంటాయి.పెరటి తోట,ఇంటి డాబా పైన,పాఠశాలలోని తోట,ఆవరణ
లాంటి ప్రదేశాలు ఆకుకూరల పెంపకానికి అనువైనవి.మునగ చెట్టు,అవిసె చెట్టు
లాంటి వాటిని ఇంటి పెరట్లో నాటి పెంచినట్లయితే, వాటినుంచి ఆకులను సేకరించడం
సులువుగా ఉంటుంది.
No comments:
Post a Comment