Saturday, January 11, 2014

పల్లీల్లో పోషకాలు ఫుల్‌


పల్లీలంటే ఇష్టంగా తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందరికీ ఇష్టమైన పల్లీల్లో బోలెడన్ని పోషకాలున్నాయి. రుచిలో వీటికి సాటి లేదనే చెప్పవచ్చు. చక్కటి రుచితో పచ్చడి, పొడి ఇలా ఏ రూపంలోనైనా పల్లీ టేస్టే వేరు. పోషకాల సంగతి పక్కనపెడితే ఇందులో అధికంగా ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు వీటిని మంచి పోషకాలుగా అందించవచ్చు. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అలాగే వీటిలో ఉండే ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్‌ కారకాలు పేరుకోకుండా క్యాన్సర్లను అదుపులో ఉంచుతాయి.
పల్లీల్లో ఉండే రెస్‌వెట్రాల్‌ అనే పాలిఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు, గుండెజబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసే శక్తిని కలిగివుంటుంది. ప్రతి వందగ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చర్మానికి హానికలగకుండా చూస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. ఇంకా పల్లీల్లో రెబోఫ్లేవిన్‌, నియాసిన్‌, థయామిన్‌, విటమిన్‌ బి6, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేవే. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసిన్‌ను పల్లీలే అందిస్తాయి. కాబట్టి పల్లీలో ఫుల్లుగా పోషకాలు ఉన్నాయని తెలిసిందికదా... చక్కగా మీరూ, మీ పిల్లలూ రోజుకు ఓ గుప్పెడు పల్లీలు తినడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

No comments:

Post a Comment