Monday, March 3, 2014

మూత్రపిండాల్లో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి, చికిత్స


మన మూత్రపిండాలు శరీరంలో ప్రవహిస్తున్న రక్తాన్ని శుద్ధం చేసి రక్తంలో ఉన్న వ్యర్ధాలను వేరు చేసి మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు పంపుతాయి. ఈ రక్తం లోని వ్యర్ధాలను మూత్రపిండాలలోకి చేర్చినప్పుడు ఉప్పు తో కూడిన వ్యర్ధాలు, మరియు ఇతర ఖనిజములు కలిగిన పదార్ధాలు కూడా మూత్రపిండాల్లో చేరుతాయి.
ఈ పదార్ధాలు పూర్తిగా మూత్రం ద్వారా బయటకు రాక కొద్ది కొద్దిగా మూత్రపిండాల్లో నిలువ ఉండి కొన్నాళ్ళకు రాళ్ళ రూపం దాల్చుతాయి. అందుకే ఎక్కువగా నీళ్ళు త్రాగమని డాక్టర్లు, పెద్దవారు చెబుతుంటారు. ఎక్కువ నీరు త్రాగితే ఈ నీరు కూడా కొంత భాగం మూత్ర పిండాల్లో చెరీ ఈ ఘన పదార్ధాలను మూత్రపిండాల్లో ఎక్కువ పేరుకు పోకుండా చేస్తుంది.
ఎప్పుడైతే మూత్రపిండాల్లో చేరిన ఈ రాళ్ళు పగిలిపోయి చిన్న చిన్న పంచదార గుళికల ఆకారంలో మారి మూత్రపు తిత్తి తో కలుపబడే సన్నటి నాళాళ్ళో ప్రవేశిస్తాయో ఆ సమయంలో విపరీతమైన నొప్పి బాధ కలుగుతుంది. ఈ రాళ్ళు మూత్ర పిండాల నుండి మూత్ర నాళాళ్ళోకి ప్రవేశించే సమయంలో విపరీతమైన నొప్పి, తరచూ మూత్రవిసర్జన జరగడం, మూత్రంలో రక్తం రావడం, వాంతులు అవ్వడం వంటివి సంభవిస్తాయి.
మీ కడుపులో కానీ, నడుములో కానీ అకస్మాత్తుగా నొప్పి అనిపిస్తే తగిన పరీక్షల కోసం వైద్యుడిని సంప్రదించడం అవసరం. మరో విషయం ఏమిటంటే కిడ్నీ రాళ్ళు ముందుగా గుర్తించడం జరుగదు. ఒక్కసారి నొప్పి అనిపించిన తరువాతనే వీటిని పరీక్షించి నిర్ధారించడం జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సి‌టి స్కాన్, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్ వంటి పరీక్షల ద్వారా మూత్రపిండాల్లో రాళ్ళను గుర్తించవచ్చు.
ఒక వేళ మూత్రపిండాల్లో రాళ్ళు ప్రారంభదశలో ఉండి చిన్నవిగా ఉంటే వైద్యులు రోజుకు 10 గ్రాసుల నీళ్ళు త్రాగి, రాళ్ళు సహజంగా శరీరంనుండి బయటకు వెళ్ళేవరకూ వేచి ఉండాలని సూచిస్తారు. ఒకవేళ రాళ్ళు పెద్దవిగా ఉండి మూత్రం ద్వారా బయటకు రాలేని పరిస్తితి అయితే డాక్టర్లు తగిన పర్యాయ చికిత్సా మార్గాలను సూచిస్తారు.
మూత్ర నాళాలను సరళించి రాళ్ళను సులభంగా బయటకు పంపేందుకు దోహదపడే అనేక మందులు లభ్యం అవుతున్నాయి. వైద్యులు వీటిని ముందుగా వాడేందుకు సలహా ఇస్తారు.
పెద్ద రాళ్ళను పగులగొట్టి చిన్న ముక్కలుగా చేసేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. ప్రధానంగా శక్తి తో కూడిన షాక్ వెవ్స్ ను పంపి రాళ్ళను పగులగొట్టేపద్ధతి. దీని వలన రాళ్ళు చిన్నవిగా పగిలి సునాయాసంగా బయటకు వస్తాయి. ఈ పద్ధతిలో అయినా రాళ్ళు బయటకు వచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. ఒక వేళ రాయి మూత్రపిండం నుండి బయటకు వచ్చి మూత్ర నాళాళ్ళో ఇరుక్కుంటే అటువంటి పరిస్థితిలో యుటెరోస్కొపీ అనే పద్ధతి ద్వారా ఓ చిన్న ట్యూబు ను మూత్ర నాలంలోనికి పంపి రాయిని చిన్న ముక్కలుగా చేసి బయటకు తీస్తారు. ఇక ఈ పద్ధతులద్వారా బయటకు రాని రాళ్ళను ఆపరేషన్ చేసి తొలగించటమే మార్గం.
మూత్రపిండల్లో రాళ్ళు కలగేందుకు కారణాలు:
ప్రధానంగా మూత్రపిండాల్లో రాళ్ళు మనం తినే, త్రాగే పదార్ధాలను బట్టి ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతారు.
చాలా తక్కువ నీళ్ళు త్రాగే వారిలో కూడా ఈ రాళ్ళు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలానే అధిక ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్ధాలు తినడం. అంటే చాక్లెట్లు, అధిక కాల్షియం ఉన్న ఆకుకూరలు తిన్నా కొందరిలో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది.
కాగా మగవారిలో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశాలు అధికం. మగవాళ్ళలో 40 సంవత్సరాల వయస్సులో ఈ రాళ్ళు ఏర్పడితే, అదే స్త్రీలలో 50 సంవత్సరాల వయసులో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. వంశపారపర్యంగా మూత్ర పిండాల్లో రాళ్ళు మనకు వచ్చే అవకాశం ఉంది. అలానే అధిక బరువు పెరగడం, మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు కలగడం మూలంగా కూడా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. అదే విధంగా ఎడారి ప్రాంతాల్లో నివసించే వారు అతి తక్కువ నీరు త్రాగడం, వేడి వాతావరణంలో ఉండటం మూలంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఆహారంలో ఉప్పు, సోడియం శాతం ను తక్కువతీసుకుంటే ఈ రాళ్లబారి నుండి తప్పించుకోవచ్చని వైద్యులు తెలుపుతారు. అలానే చాక్లెట్, కాఫీ, చిక్కుళ్ళు, కమలా పండ్లు, బంగాళా దుంపలు వంటి పదార్ధాలు తీసుకోకూడదు. అలానే కాల్షియం మెండుగా ఉన్న ఆహార పదార్ధాలను కూడా తీసుకోవడం మానివేయాలి.

No comments:

Post a Comment