తులసి మొక్కతో ఫ్లోరైడ్ నియంత్రణ
95% దాకా తగ్గుతున్న ప్రభావం
నిర్ధారించిన నల్లగొండ జిల్లా అధికారులు
తాగునీటిలో దాగి ఉండే గరళం! మనుషుల్ని మంచానికే పరిమితం చేసే మహమ్మారి!!
రాష్ట్రంలో దాదాపుగా 20 జిల్లాలను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతం.. క్రమేపీ ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. భూగర్భజలాలను అడుగంటా తోడేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతోంది. దీర్ఘకాల వినియోగంతో.. ఎముకల్ని దారుణంగా దెబ్బతీసి, కాళ్లు, చేతులు వంగిపోయేలా, దంతాలు పాడైపోయేలా చేసే ఈ మహమ్మారి ఫ్లోరైడ్కి మందే లేదా అంటే.. ఇన్నాళ్లూ లేదుగానీ, ఇప్పుడు దానికి సరైన విరుగుడు దొరికింది! ఆందోళనకర స్థాయుల్లో ఉండే ఫ్లోరైడ్ ప్రభావాన్ని నామమాత్రం చేసి ప్రాణాలు కాపాడే ఆ వరదాయిని.. మన ఇంటింటి మొక్క.. తులసి మొక్క!! అవును, ఇది నిజంగా నిజం.
ఫ్లోరైడ్ నియంత్రణకు తులసిపై ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రయోగాలు, వాటి ఫలితాలపై అధ్యయనం చేసిన నల్లగొండ జిల్లా అధికారులు ప్రయోగపూర్వకంగా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. ప్రయోగశాలలో తులసి ప్రభావాన్ని పరీక్షించి సత్ఫలితాలు పొందారు.
ఇంతకుముందు.. చంద్రాపూర్ (మహారాష్ట్ర)లోని సర్దార్ పటేల్ మహావిద్యాలయలోని ఎన్విరాన్మెంట్ సైన్సెస్ పరిశోధకులు ఫ్లోరైడ్ నియంత్రణలో తులసి విజయవంతంగా పనిచేస్తోందని నిరూపించారు. 100 మిల్లీలీటర్ల నీటిలో 75 మిల్లీగ్రాముల తాజా తులసి ఆకుల్ని వేసి ఒక పాత్రలో ఉంచి 20 నిమిషాల తర్వాత పరీక్ష చేయగా అందులో ఫ్లోరైడ్ 95 శాతం తగ్గినట్లు తేలింది.
ఈ విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ నియంత్రణ, పర్యవేక్షణ ప్రత్యేకాధికారి నర్సింహులు స్థానికంగా ప్రయోగాలు చేయించారు. జిల్లాలో అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న నార్కట్ పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడెం నుంచి బోరు బావి నీటిని జిల్లా కేంద్రానికి తెప్పించారు. ఆ నీటిలో 200 ఆకులున్న తులసి కొమ్మను వేశారు. ఉదయం 7 గంటలకు నీటిని పరీక్షించగా 7.4మిల్లీగ్రాములున్న ఫ్లోరైడ్.. మధ్యాహ్నం 12.30 గంటలకు 6.4 మిల్లీగ్రాములకు తగ్గింది. సాయంత్రం 6 గంటల సమయంలో పరీక్షించగా 1.2 మిల్లీగ్రాములకు చేరింది.
ఇలా 10 రోజుల పాటు పరిశీలించిన తర్వాత, విజయవంతంగా పనిచేస్తోందని తేలాక, ఈ వివరాలను అధికారులు బయటికి వెల్లడించారు. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరైడ్ను గ్రహించి కాల్షియం విడుదల చేస్తున్నాయని, ఇదే ఫ్లోరైడ్ను తగ్గిస్తోందని వివరించారు. జిల్లాలోని 59 మండలాలకుగాను 48 మండలాల్లో సుమారు 25 లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులున్నారు. కలెక్టర్ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో జిల్లా అధికారులు తులసి ప్రయోగాలు సమర్ధంగా పూర్తి చేశారు. తులసిపై ప్రయోగాలు ఫలించిన నేపథ్యంలో.. జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత 48 మండలాల్లో ఇంటింటికీతులసి మొక్క పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు కలెక్టర్ తెలిపారు.
No comments:
Post a Comment