Tuesday, April 2, 2013

ఉచితంగా ఆరోగ్యం


* ఉచితంగా ఆరోగ్యం

ఖర్చు పెట్టి మందులను మాత్రమే కొనగలం. ఆరోగ్యాన్ని కొనలేంఅన్నది ఒక నానుడి. కానీ ఆరోగ్యాన్ని ఉచితంగానే పొందవచ్చు. మనం రోజూ చేసే పనులతోనే ఒక్క పైసా ఖర్చు కాకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. కాకపోతే కొద్దిపాటి వ్యాయామం, మంచి బ్రేక్‌ఫాస్ట్, క్రమం తప్పకుండా వేళకు నిద్రపోవడం వంటి కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుందంతే. ఇవన్నీ ఫ్రీగా లభించేవే.

మనం పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది. కానీ మనం పనిచేయకపోయినా మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా? మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని ప్రోటీన్ ఖర్చవుతుంది. శారీరక శ్రమ లేనివారిలో ప్రతి వారం 1.54 గ్రాముల మేరకు ఎముకను కోల్పోతాం. కొన్ని రోజుల పాటు అదేపనిగా రెస్ట్ తీసుకుంటే 10-15 శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం. దీన్ని అధిగమించాలంటే ఖర్చు చేయాల్సింది డబ్బు కాదు... కేవలం కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాలు కేటాయించి రోజూ నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను, ఎముకలను (మజిల్ లాస్ అండ్ బోన్ లాస్)ను అరికట్టవచ్చు. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా వేళకు బ్రేక్‌ఫాస్ట్, వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఆరోగ్యం కోసం శారీరక శ్రమ అవసరం. దానికోసం గుర్తుపెట్టుకుని పాటించాల్సిన అంశాలివి... 
వాకింగ్ అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం. 

జాగింగ్, రన్నింగ్ వంటివి మొదలుపెట్టే ముందర వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. 

{
పతిరోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ అలా వారంలో కనీసం ఐదుసార్లు పాటించాలి. 

వాకింగ్‌లో వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. 

వాకింగ్ ఏ వేళలో చేసినా పరవాలేదు. ఉదయం వేళల్లో అయితే మంచిది. 

వాకింగ్ చేస్తే తప్పనిసరిగా చెమట పట్టాలనే నియమం లేదు. 

జబ్బుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం మంచిది కాదు. 
నడక మొదలుపెట్టాక ఆపడం మంచిది కాదు. ప్రతిరోజూ చేయాలి. ఎందుకంటే ఒకసారి నడక మొదలు పెట్టాక అడపాదడపా మానేస్తుంటే శరీరం దానికి అడ్జస్ట్ కావడం అన్నది కష్టమై శరీరంమీద చాలా ఒత్తిడి పడుతుంది. 

పరగడపున వాకింగ్ కంటే ఏదైనా తేలికపాటి శ్నాక్ తీసుకుని వాకింగ్ చేయడమే మంచిది. 

స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్న స్పృహ మిమ్మల్ని ఆ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది. 

మంచి బ్రేక్ ఫాస్ట్: మనం ఒక రోజులో ఖర్చు పెట్టే శక్తిలో మూడింట ఒకవంతు మనం ఉదయం తీసుకునే ఆహారం (బ్రేక్ ఫాస్ట్) తోనే వస్తుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కేవలం శక్తిని పొందడం మాత్రమే కాదు... మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది. 

ఉదాహరణకు 
మనలో చిరాకుపడే తత్వం తగ్గుతుంది. 

దేనిమీదనైనా దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి పెరుగుతుంది. 

అవసరాన్ని బట్టి తదేకంగా పనిచేయగలిగే శక్తి మెరుగవుతుంది. 

దానితో పాటు మన బరువుకు తగినట్లుగా వేళకు మంచి ఆహారం తీసుకోవాలి. 

దీనితో పాటు మన ఆహార అవసరాలకు తగినట్లుగా అవసరమైనన్ని క్యాలరీల ఆహారమే తీసుకోవాలి.

No comments:

Post a Comment