Tuesday, September 3, 2013

కీళ్లనొప్పులకు సరైన విరుగుడు



ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఎంతో మంది కీళ్లనొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. 30-40 సంవత్సరాల లోపే కీళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసే కీళ్ల నొప్పులకు ఆయుర్వేద వైద్యమే సరైన చికిత్స అంటున్నారు నేటి జీవనశైలి మానవ జీవితాన్ని, ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తోంది. అందుకే జీవన విధానంలో వచ్చిన అనేక మార్పులే కీళ్ల నొప్పులకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలోని మార్పు. సరైన సమయంలో భోజనం చేయకపోవటం, ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినటం, పోషక విలువలున్న ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవటం, సరైన సమయంలో నిద్రపోకపోవడం(స్వప్న విపర్వం- అంటే పగలు నిద్రపోవడం, రాత్రి మేల్కోవటం) కూడా కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా కీళ్ల నొప్పులకు కారణాలుగా చెప్పుకోవచ్చు. కీళ్ల నొప్పుల్ని ఆయుర్వేద వైద్య విధానంలో మూడు విధాలుగా వర్ణించారు. అవి సంధివాతం, ఆమవాతం, వాతరక్తం. సంధివాతం: దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్గా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. త్రిదోష పరంగా చూసినట్టయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్ల నుండి శబ్దాలు వినిపిస్తాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేష కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వల్ల నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. సమస్య 50-60 సంవత్సరాల వారికి వస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో వ్యాధి ఎక్కువ. ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సొరియాసిస్ లాంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తుంటాయి. ఆహారంలో పోషక విలువల లోపం వల్ల కూడా(విటమిన్-డి, కాల్షియం) వ్యాధి వస్తుంది. ఎక్కువగా ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించడం, అధిక బరువులు మోయడం వల్ల, ఎక్కువ సమయం కంప్యూటర్స్ ముందు గడపడం వల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆమవాతం: రుమాటాయిడ్ ఆర్థరైటిస్ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ఆమ- వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్ల సమస్య వస్తుంది. ఇది మానసిక ఒత్తిడి వల్ల, ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, వ్యాయామం చేయకపోవటం, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలు సమస్యకు దారితీస్తాయి. ముఖ్యంగా విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు, నొప్పి, మందజ్వరం, కీళ్లు బిగుసుకుపోవటం, ఆకలి మందగించటం, మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి అన్ని కీళ్లలోనూ కనిపిస్తుంది.
వాతరక్తం: ఇది మధ్య వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మద్యం తీసుకోవడం, అతిగా మాంసాహారం తీసుకోవడం, పులుపు, ఉప్పు, మసాలాలు, ప్రిజర్వేటిస్, కెమికల్స్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం సమస్యకు ప్రధాన కారణాలు. అలాగే శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వంటి కారణాల వల్ల కూడా వాతం, రక్తం సమస్యలుత్పన్నమవుతాయి. రెండూ కలిసి వాతరక్త సమస్యగా మారుతుంది. క్లినికల్గా చూసినట్టయితే, సమస్యలో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి. లక్షణాలు: వాపు, నొప్పి కాలి బొటనవేలు నుండి ప్రారంభమై తర్వాత కీళ్లకు వ్యాపిస్తాయి. సమస్యలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. పరిష్కార మార్గాలు: - నిదాన పరివర్జనం - ఔషధ సేవన - ఆహార-విహార నియమాలు. మూడు పద్ధతుల ద్వారా వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. నిదాన పరివర్జనం: వ్యా«ధి కారణాలను పాటించకుండా ఉండటం ఇందులో ప్రధానమైనది. ఉదా: పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొవటం వంటివి వదిలిపెట్టటం. ఆహార-విహార నియమాలు: సరైన సమయానికి ఆహారం తీసుకోవటం. వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, వ్యాయామం, సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవటం లాంటి నియమాలు పాటించాలి. ఔషధ సేవన: ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఒకటి శమనం, రెండోది శోధనం. శమనం: వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. శోధనం: అంటే..పంచకర్మ. పంచకర్మలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు)తరువాత వమన, విరేచన, వస్తి(ప్రధాన కర్మలు). తరువాత పశ్చాత్కర్మలు చేయించవలసి ఉంటుంది. ఇవి కాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, ఓమ వస్తి, పత్రపోడలీ, వాలుకాస్వేద మొదలైన బాహ్య చికత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

No comments:

Post a Comment