Tuesday, September 15, 2015

పుదీనా - ఆరోగ్యానికి నజరానా

ప్రకృతి మనకు ఎన్నో రకాల పదార్థాలను ప్రసాదించింది. వాటిలో కొన్నిటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటే.. మరికొన్నిటిలోని ఔషధ గుణాలు శరీరంలో ఉన్న వ్యాధులనూ తగ్గించేస్తాయి. అలాంటి గుణాలు కలిగిన వాటిలో 'పుదీనా' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఉంది. అంతేకాదు పుదీనా వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి.
• అజీర్తి నివారణలో...
అజీర్తి సమస్యలను నివారించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో పుదీనా కీలక పాత్ర వహిస్తుంది. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు తలెత్తే కడుపునొప్పి, వికారం వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఆహారం జీర్ణమయ్యే సమయంలో పైత్య రసాలు ఎక్కువగా విడుదలైతే, అది సులభంగా జీర్ణమై ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తవు. పొట్టలో ఈ ప్రక్రియను ప్రేరేపించి, సులభంగా ఆ రసాలను ఎక్కువ మోతాదులో విడుదల చేయించే గుణం పుదీనాలో ఉంది. దీంతో తీసుకున్న ఆహారం జీర్ణమై, ఆకలి లేకపోవడం, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి.
• అలర్జీలకు దూరంగా..
వాతావరణం మారినప్పుడల్లా మనిషి శరీరంలోనూ అనేక రకాల మార్పులు సంభవిస్తుంటాయి. కొందరైతే చిన్న మార్పులకూ తట్టుకోలేరు. వెంటనే అనారోగ్యాల బారిన పడిపోతుంటారు. పుదీనా ఆకుల్లో ఉండే రొస్మారినిక్ ఆమ్లం వివిధ రకాల అలర్జీలను రూపుమాపడంలో కీలక పాత్ర వహిస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. అందుకే వివిధ రకాల అలర్జీలతో ఇబ్బందిపడేవారు రోజూ పుదీనాను ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది.
• వీటినీ తగ్గిస్తుంది..
పుదీనాలో జలుబు, దగ్గును తగ్గించే శక్తి ఉంది. గొంతు నొప్పి, మంట, తలనొప్పి దరిచేరకుండా చేసే ఔషధం ఇది. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పుదీనా టీని తీసుకోవడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు. అలాగే దగ్గు ఎక్కువగా ఉన్పప్పుడు వేడి నీళ్లలో కాస్త పుదీనా రసం వేసి ఆ నీళ్లతో ఆవిరిపడితే సమస్యను అధిగమించవచ్చు.
• నోటి సమస్యలకు చెక్
రోజూ కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన, దంతక్షయం వంటి సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. అంతేకాకుండా నాలుక, దంతాలను శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది. అందుకే కొన్ని టూత్‌పేస్ట్ తయారీ సంస్థలు సైతం తమ ఉత్పత్తుల్లో పుదీనాను ఉపయోగిస్తున్నాయి. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల కారణంగానే ఇది నోటి సమస్యకు సరైన ఔషధంలా పనిచేస్తుంది.
• ఆ సమయంలోనూ...
నెలసరి సమయంలో కొందరు అమ్మాయిలు వాంతుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీంతో ఏదీ తినాలనిపించక, నీరసపడిపోతారు. ఇలాంటి వారికి పుదీనా టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. రోజుకు నాలుగైదు సార్లు దీన్ని తీసుకోవడం వల్ల వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. పుదీనాలోని యాంటీ స్పాస్మోడిక్ గుణాల కారణంగా దీన్ని తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పినీ తగ్గించుకోవచ్చు. పుదీనా టీ వల్ల కండరాలకు సైతం ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు గర్భిణులు సాధారణంగా ఎదుర్కొనే వాంతులు, వికారం వంటి సమస్యలను కూడా తగ్గించే లక్షణం పుదీనాలో ఉంది. దీనికోసం చేయాల్సిందల్లా.. రోజూ పొద్దున్నే కొన్ని పుదీనా ఆకులను చేత్తో బాగా నలిపి, వాటి వాసన పీల్చిస్తే చాలు.
• చర్మ సంరక్షణకు..
పుదీనా రసం చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మొటిమలు, మచ్చలపై దీని రసాన్ని రాస్తే త్వరగా తగ్గుతాయి. వీటితో పాటు దోమ, తేనెటీగ, కందిరీగ వంటి కీటకాల కాటు వల్ల కలిగే ఎరుపుదనం, మంట నుంచి పుదీనా రసం మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉండే నాణ్యమైన పుదీనా ఆయిల్‌తో ముఖంపై మర్దనా చేసి, కడుక్కుంటే చర్మం శుభ్రపడడంతో పాటు నిగారింపును సంతరించుకుంటుంది.
• ఇవే కాకుండా..
ఆకలి మందగించినప్పుడు పుదీనా పచ్చడిని తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇందులోని ఔషధ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌ను అరికట్టడంలో సహకరిస్తాయి. శరీర బరువును నియంత్రించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, తలనొప్పి, ఆస్తమాని తగ్గించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలెన్నో.. అందుకే మీరు కూడా దీని వాడకాన్ని పెంచి, ఆరోగ్యంగా ఉండండి.

No comments:

Post a Comment