ముఖవర్చస్సు కోసం...!
అందంగా ఉండేవారు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనే ప్రయత్నిస్తారు. కొంతమంది శరీర భాగాలన్నీ మంచి రంగుతో ఉండి ముఖం మాత్రమే నల్లగా ఉంటే భరించలేరు. ఇది ఆడవారి విషయంలోనే కాదు మగవారి విషయంలోనూ కనపడుతుంది. ముఖం నల్లగా ఉందనే మానసిక వేదన పోగొట్టుకునేందుకు అనేక ఆధునిక చికిత్సలు వచ్చినా ఎక్కువ శాతం అలనాటి సంప్రదాయ చికిత్సలకే మొగ్గు చూపుతున్నారు. వీటివల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. అందమైన ముఖవర్చస్సు కోసం కొన్ని సులభ చికిత్సలు పరిశీలిద్దాం...!
కొన్ని గులాబీ రేకులను మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. సుమారు ఒక టీ స్పూన్ పేస్టుకి రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపాక తర్వాత మళ్లీ నూరి ఫ్రిజ్‌లో పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చిక్కని క్రీములాగా ఉండే ఈ పేస్టుని ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతమవుతుంది.
యాపిల్‌పై ఉండే తొక్క తీసి ముక్కలుగా తరిగి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే మచ్చలు ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల శెనగపిండిని, 2 టీ స్పూన్ల వెన్నను చిటికెడు పసుపు తీసుకుని బాగా కలపాలి. ముఖాన్ని ముందుగా చల్లని నీటితో కడిగి జిడ్డు లేకుండా మెత్తటి తువాలుతో తుడవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న పేస్టును ముఖమంతా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేయాలి. ఆశించిన ఫలితం కలుగుతుంది.
నారింజ పండ్ల పైతోలు ఎండించి చేసిన పౌడర్‌ను కొంచెం తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును 20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
తొలుత ముఖాన్ని సున్నిపిండితో కడగాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసి దీనిలో బాగా పండిన అరటిపండును కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే శరీరఛాయ మరింతగా మెరుగవుతుంది.
ఈ ఫేస్‌ప్యాక్‌లన్నీ రోజూ ఉదయం స్నానానికి ముందు ఆచరించి ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేయాలి. ముఖ్యంగా ప్రతి రోజూ ఎక్కువగా నీరు తాగాలి. దీంతో పాటు తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. దీనివల్ల మీరు ఆశించిన ఫలితం త్వరగా పొందుతారు.
No comments:
Post a Comment