గోళ్ల రక్షణకు సులభ మార్గాలు..!
గోళ్లపై మచ్చలు, గుంటలు, పగుళ్లు, గోరు చుట్టూ చీము పుట్టడం.. లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులు. సహజంగా సొరియాసిస్, ఎగ్జిమ మొదలైన చర్మ వ్యాధులతో పాటు ఫంగస్ ఇన్ఫెక్షన్ల వల్ల అందమైన గోళ్లు పాడవుతుంటాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేయటం వల్ల గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్లు నానడం, కడిగిన గిన్నెలనే పదే పదే కడగటం చేసే స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ.
• సులభ చికిత్సలు
మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకొని గోళ్లకు రాత్రి పూట పట్టించాలి. గోరింటాకు రాలిపోకుండా పలచని తెల్లగుడ్డను చుట్టి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. దీని వల్ల ఫంగస్ ఏర్పడిన పిప్పి గోళ్లు, పగుళ్లు, ముడతలు, మచ్చలు మొదలైన సమస్యలు తగ్గిపోతాయి.
పై పొరను తీసిన బంగాళదుంపను మెత్తగా నూరాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్లకు పట్టించి ఉదయాన్నే కడగాలి. ఇలా చేస్తే ఫంగస్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి.
కొద్దిగా పసుపు తీసుకుని నీటితో గాని, నిమ్మరసంలో గాని కలిపి ముద్దగా చేసి వ్యాధి సోకిన భాగాల్లో గోళ్లకు పట్టించి రాలిపోకుండా తెల్లని పలుచని గుడ్డను కట్టి రాత్రి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.
రాత్రి పడుకునే ముందు పలుచని తెల్లగుడ్డను నిమ్మరసంలో కొద్దిసేపు తడిపి వ్యాధి సోకిన గోళ్లకు చుట్టాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు రావు. దీంతో పాటు గోళ్లపై ఉండే సహజమైన రంగు పోకుండా ఉంటుంది.
పల్చటి తెల్ల గుడ్డను ఉల్లిపాయ రసంలో బాగా తడిపి వ్యాధి ఉండే గోళ్లకు చుట్టాలి. దీని వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.
కూరల్లో వాడుకునే దోసకాయ ముక్కల్ని తరచుగా తింటుంటే పిప్పి గోళ్లు, గోళ్ల పగుళ్లు, మచ్చలు తగ్గిపోతాయి.
No comments:
Post a Comment