Monday, November 9, 2015

చేతి వేళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ గుట్టు!

అరచేతి గీతలతో భవిష్యత్తు తెలుస్తుందో లేదో గానీ.. వేళ్ల పొడవును బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు! విచిత్రంగానే అనిపించినా.. చూపుడు వేలు కన్నా ఉంగరం వేలు పొడవుగా గలవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువని పరిశోధకులు చెబుతుండటమే దీనికి నిదర్శనం. కొన్ని అధ్యయనాలూ దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. అంతమాత్రాన ఉంగరం వేలు పొడవుగా ఉన్నవారు అప్పుడే భయపడిపోకండి. దీనిపై ఇంకా చాలా అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇతరత్రా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కారకాలు గలవారిలో మాత్రం వేళ్ల తీరును కొట్టిపారేయటానికి లేదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఉంగరం వేళ్ల కన్నా చూపుడు వేళ్లు పొడవుగా గలవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు 33% తక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై మరో కోణంలో అధ్యయనం చేయగా.. చూపుడు వేళ్ల కన్నా ఉంగరం వేళ్లు పొడవుగా గలవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతున్నట్టు తేలింది. దీనికి కారణం లేకపోలేదు. మన శరీరం వృద్ధి చెందటంలో హోక్స్ (హెచ్ఓఎక్స్) జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. పిండస్థ దశలో ప్రోస్టేట్ గ్రంథి, మూత్రపిండాల వంటి అవయవాల విషయంలోనే కాదు.. వేళ్ల అభివృద్ధిలోనూ ఇవి పాలు పంచుకుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ కణితుల్లో హోక్స్ జన్యువుల నిష్పత్తి అస్తవ్యస్తంగా ఉంటున్నట్టూ బయటపడింది. క్యాన్సర్లు తలెత్తటంలో పాలు పంచుకునే టెస్టోస్టీరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లతో హోక్స్ జన్యువులు ఎలా చర్య జరుపుతున్నాయో అనేది ఇంకా స్పష్టంగా బయటపడలేదు. కానీ ఉంగరం వేలు పెద్దగా ఉండటానికీ ఈస్ట్రోజెన్ హార్మోన్‌కూ సంబంధం ఉండటం మాత్రం నిజం. తల్లికడుపులో ఉండగా ఈస్ట్రోజెన్ స్థాయులు ఎక్కువగా గలవారిలో ఉంగరం వేళ్ల కన్నా చూపుడు వేళ్లు పొడవుగా ఉంటున్నట్టు తేలింది కూడా. అందువల్ల హోక్స్ జన్యువులకూ ఈస్ట్రోజెన్, టెస్టోస్టీరాన్ హార్మోన్లకూ గల సంబంధంపై మరింత అధ్యయనం చేస్తే.. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కొత్త చికిత్సలను రూపొందించటమే కాదు, మున్ముందు వేళ్ల పొడవును బట్టే జబ్బు ముప్పును కొంతవరకు అంచనా వేసే వీలుంటుందనీ ఆశిస్తున్నారు.

Saturday, November 7, 2015

వేప దివ్యౌషధం

ఔషధ విలువలు, సౌందర్య ప్రయోజనాలు సమంగా గల అరుదైన చెట్టు వేప. దీని ఆకులు, కాండం, నూనె, పూలు, గింజలు, పండ్లు ఇలా వేప చెట్టుకు సంబంధించిన ప్రతిదీ ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు
సంప్రదాయంగా వేప ఆకులతో తయారు చేసే ఔషధాలు మలేరియా, మధుమేహం, గుండె జబ్బులు, చర్మవ్యాధులకు ఉపయోగపడుతూ వ చ్చాయి. గర్భనిరోధకంగా పనికొచ్చే అంశాలు కూడా వేపలో ఉన్నాయి. యాంటీ అల్సర్‌, యాంటీ ఫంగ్‌సగా ఉపయోగపడే మూలకాలు కూడా వేపలో ఉన్నాయి. అల్సర్లను నయం చేయడంతో పాటు వేపాకుకు అజీర్తి సమస్యను నిర్మూలించే గుణం కూడా ఉంది. ప్రతి రోజూ వేపాకును వాడుతూ ఉంటే, కేన్సర్‌ కణాలు బహుముఖంగా విస్తరించే అవకాశాలు తగ్గిపోతాయి. వేపకు సంబంధించిన వివిధ భాగాలను తీసుకోవడం వల్ల కేన్సర్‌ కణజాలం పెరగడం ఆగిపోతుంది.
ఫ్లూ, కొన్ని ఇతర జ్వరాల్ని తగ్గించడంలో వేప ఔషధాలు ముందు వరుసలో ఉంటాయి. వేప పేస్ట్‌ యాంటీ- బ్యాక్టీరియల్‌ నిర్మూలకంగా పనిచేయడంతో పాటు, స్వల్పంగా ఉన్న చర్మ సంబంధితమైన ఇన్‌ఫెక్షన్లను, గాట్లను, పుండ్లను మాన్పడంలో బాగా ఉపయోపడుతుంది..
ఇన్సులిన్‌ రిసెప్టార్లను చైతన్యపర్చడం ద్వారా వేప ఆకులు రక్తంలోని షుగర్‌ నిలువల్ని తగ్గిస్తాయి. దీనికి తోడు ఆధునిక వైద్యానికి సంబంధించిన యాంటీ-డయాబెటిక్‌ మందుల మీద ఆధారపడటాన్ని బాగా తగ్గిస్తూ మధుమేహం నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వేప నూనె దోమల్ని తరిమి కొట్టే రిపెల్‌గా కూడా ఉపయోగపడుతుంది.
సౌందర్య పోషణకు వేపాకులో ఉండే యాంటీ- బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ అంశాల కారణంగా పలు రకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు, దద్దుర్లకు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. వేప నీరును చర్మపు బిగువును పెంచే స్కిన్‌ టోనర్‌ కూడా. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతి వంతంగా మారుతుంది. పొడి చ ర్మపు సమస్యను కూడా ఇది పోగొడుతుంది. తలకు వేపాకు పట్టించడం ద్వారా తల మీదున్న దురద, చుండ్రు సమస్యలు తొలగిపోవడంతో పాటు జుత్తు కూడా బాగా పెరుగుతుంది.

Thursday, November 5, 2015

మెరిపించే సెనగపిండి...!

ఈ కాలంలో రకరకాల చర్మ సమస్యలు ఇబ్బంది పెడతాయి. వాటన్నింటికీ సెనగపిండితో పరిష్కారం సాధించొచ్చు.

• సెనగపిండిని అప్పుడప్పుడూ సున్నిపిండిలా వాడుకోవచ్చు. దీనివల్ల చర్మంపై పేరుకొన్న మురికి తొలగిపోయి... శుభ్రపడుతుంది. టాన్‌కూడా వదిలిపోతుంది. చర్మం సున్నితంగా మారుతుంది. మృతకణాలూ తొలగిపోతాయి.

• నాలుగు చెంచాల సెనగపిండిలో చెంచా పాలూ, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమం తయారు చేయాలి. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి.. ముఖానికి రాసుకోవాలి. పావుగంటపాటు మర్దన చేయాలి. కాసేపు అలా వదిలేసి చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలాచేయడం వల్ల నల్ల మచ్చలు తగ్గి చర్మం కాంతిమంతంగా మారుతుంది.

• జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి వేసవిలోనే కాదు.. చలికాలంలోనూ ఇబ్బంది తప్పదు. అలాంటప్పుడు నాలుగు చెంచాల సెనగపిండిలో కొద్దిగా పెరుగూ, పాలూ కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేసుకుంటే చర్మంపై పేరుకొన్న మురికీ, దుమ్మూ తొలగిపోతాయి. జిడ్డు వదిలిపోతుంది.

• మొటిమల సమస్యలతో బాధపడుతున్నప్పుడు చెంచా సెనగపిండిలో కొద్దిగా గంధం, కొన్ని పాలూ, చిటికెడు పసుపూ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. పూతలా రాసుకొని ఆరాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.

• కొందరికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. అలాంటి వారు సెనగపిండిలో పెరుగూ, నిమ్మరసం, పసుపూ చేర్చి నలుగులా పెట్టుకోవాలి. కడిగేసుకున్న తరవాత నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. నిమ్మరసం, పెరుగూ తేమ శాతాన్ని పెంచి నలుపుదనాన్ని పోగొట్టి చర్మాన్ని మెరిపిస్తాయి.

• మూడు చెంచాల సెనగపిండిలో చెంచా ఓట్స్ పొడీ, అరచెంచా మొక్కజొన్న పిండీ, కొన్ని పాలూ చేర్చి స్క్రబ్ చేసుకోవాలి. తరవాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి.. చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

వ్రణాలకు మూలికా వైద్యం ..!


శరీరంలో ఏ భాగంలోనైనా చిన్న చిన్న గడ్డలుగా ఏర్పడి క్రమేపీ వాపు, నొప్పి, మంటతో పెద్ద గడ్డలుగా మారి అందులో చీము చేరి పుండుగా బాధించే వాటినే ‘వ్రణాలు’ అని ఆయుర్వేదంలో పిలుస్తారు. వీటిలో కొన్ని ప్రాణాంతకంగా ఉంటాయి. అధికశాతం చికిత్స చేయవచ్చు. వ్రణాలకు సంబంధించిన చికిత్సను ఇంట్లోనే చేసుకోవచ్చు.

అవిశె గింజలను మజ్జిగలో మెత్తగా నూరి ఉడకబెట్టి పట్టిస్తే గడ్డలు పగిలి తగ్గిపోతాయి.
రావి ఆకులను వాపుతో కూడిన రక్త గడ్డలపై కప్పి కడితే త్వరగా ఉపశమనం వస్తుంది.

ఎండిన రావి పట్టను చూర్ణం చేసి పగిలిన గాయాలు, గడ్డలపై చల్లుతుంటే త్వరగా తగ్గుతాయి.
అత్తిపాలను వ్రణాలపైన, పుండ్లపైన రాస్తుంటే తగ్గుతాయి.
బచ్చలాకును మెత్తగా నూరి కొద్దిగా ఆముదం కలిపి ఉడికించి వెచ్చగా ఉన్నప్పుడు గడ్డలపై వేసి తడుతుంటే త్వరగా తగ్గుతాయి.
బాగా పండిన అరటి ఆకులను వ్రణాలపై వేసి కడితే చీముతో కూడిన రక్తాన్ని త్వరగా తగ్గిస్తుంది.

కలబంద గుజ్జును తీసి ఉడికించి వెచ్చగా ఉన్నప్పుడే వ్రణాలపై కడుతుంటే త్వరగా తగ్గిపోతాయి.
నల్ల నువ్వులను మెత్తగా నూరి తేనె కలిపి పట్టిస్తే మంచి ఫలితం కలుగుతుంది.

తులసి ఆకుల రసంలో పగిలిన వ్రణాన్ని శుభ్రపరచి ఆ రసంతో దూదిని తడిపి వ్రణంపై కడితే తగ్గిపోతుంది.

పాతబడిన ఎండు కొబ్బరి నుండి తీసిన కొబ్బరి నూనెను వ్రణాలపై రాస్తుంటే త్వరగా తగ్గిపోతాయి.
మెంతి ఆకులను మెత్తగా నూరి నేతిలో ఉడికించి వెచ్చగా ఉన్నప్పుడు పైన వేసి కడితే త్వరగా వ్రణాలు తగ్గుతాయి.
మర్రి పాలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వ్రణాలపై రాస్తుంటే చీము, వాపుతో కూడిన వ్రణాలు త్వరగా తగ్గిపోతాయి.

పొట్టను తగ్గిస్తుంది:

ఈ రోజుల్లో పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. యువతీ, యువకుల నుంచీ అందరి పొట్టను తగ్గించే శక్తి ఈ అనాసపండుకి ఉంది. ఒక అనాసపండుని చిన్నచిన్న ముక్కలుగా కోసి, నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. తర్వాత రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.

ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి.

భోంచేశాక ఇవి తినాలి...!

భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి... ఆ ప్రయోజనాలేంటో తెలుసా!

• ఆపిల్: ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు భోంచేశాక ఆపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. భోంచేశాక పదిహేను నిమిషాల తరవాత దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగితీసుకుంటే ఇంకా మంచిది.

• అరటిపండ్లు: ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది.

• బొప్పాయి: కొందర్ని అజీర్తి సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

• అనాస: ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

• అంజీరా: గుప్పెడు అంజీరాలో పదిహేను గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

Monday, November 2, 2015

అందానికి కీర ..!

కీరదోసకాయ తింటే శరీరంలో వేడి తగ్గిపోతుంది. కొవ్వుతో పాటు హైపర్‌టెన్షన్‌ను తగ్గించే గుణమున్న దోసతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. 
ఒక టేబుల్‌ స్పూన్‌ ఓట్‌మీల్‌ను, దోసకాయ తురుములో కలపాలి. అందులో మజ్జిగ, నిమ్మరసాలను ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున కలిపి పేస్ట్‌ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. చల్లదనం కోసం ఈ ఫేస్‌ ప్యాక్‌ను అందరూ వేసుకోవచ్చు.

• ఆయిలీ స్కిన్‌

ఒక కప్పులో టేబుల్‌ స్పూన్‌ పసుపు, అర కప్పు కీర దోస గుజ్జు కలిపి పేస్ట్‌ చేసుకుని ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.
కీరా గుజ్జుకు తగినంత పెరుగు కలిపి పేస్ట్‌ చేసుకుని ముఖానికి రాయాలి. కాసేపయ్యాక చన్నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

• పొడి చర్మం

కీర దోసకాయ గుజ్జులో టేబుల్‌ స్పూన్‌ ఓట్‌మీల్‌, తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

• మృదువైన చర్మానికి

కీరా గుజ్జులో కొన్ని చుక్కల కలబంద జెల్‌ కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది.

• చర్మం మెరుపునకు

కీరా గుజ్జులో రెండు స్పూన్ల పెరుగు కలపాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి రాస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. కీరా గుజ్జులో పుదీనా ఆకుల్ని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రపరిస్తే చర్మం నిగనిగలాడుతుంది.

వేపాకు... అద్భుత ఔషధం!

వేప ఆకులూ బెరడూ నూనెగింజలూ పండ్లూ పువ్వులూ అన్నీ ఔషధభరితాలే. అందుకే ప్రాచీనకాలంనుంచీ సంప్రదాయ వైద్యంలో వీటిని వాడుతుండేవారు. వేపాకుల్లో బ్యాక్టీరియానీ ఫంగస్‌నీ నిర్మూలించే లక్షణాలు ఉన్నాయి. ఈ ఆకుల్ని ముద్దలా చేసి చర్మవ్యాధులైన అలర్జీలూ, మొటిమలూ, దద్దుర్లూ, నల్లమచ్చల నివారణకు వాడటంవల్ల చక్కని ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని రసాయనాలు పొట్ట, పేగుల్లోని ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియానూ చక్కెరవ్యాధినీ నివారిస్తాయి. వేప పుల్లల్ని నమలడంవల్ల దంతక్షయం, నోట్లో అల్సర్లు ఏర్పడకుండా ఉంటాయి. హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది. పోతే వేపనూనెను తలకు పెట్టుకోవడం వల్ల చుండ్రు తగ్గి, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఒంటికి రాసుకోవడం వల్ల దోమల్లాంటివి కుట్టకుండా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, రోజూ కాసిని వేపాకుల్ని తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి పెరగకుండా ఉంటుందన్నది సరికొత్త పరిశోధన. ఈ ఆకుల్లోని రసాయనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట.

Sunday, November 1, 2015

డెంగ్యూని తరిమికొట్టే పవర్ ఫుల్ టిప్స్....

తులసి ఆకులు డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి తులసి ఆకులు చక్కటి పరిష్కారం. రోజుకి రెండు సార్లు.. 10 నుంచి 15 తులసి ఆకులు నమలడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.కొత్తిమీర కొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలతో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాలి.
ఉమ్మెత్త ఆకులు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉమ్మెత్త ఆకులు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్ బారి నుంచి తగ్గించి.. జ్వరాన్ని నివారించడానికి ఈ ఆకులు తోడ్పడతాయి.
మెంతులు డెంగ్యూ నివారణలో చక్కటి పరిష్కారంగా మెంతులు చెప్పవచ్చు. మెంతులతో చేసిన టీ తాగితే మంచిది. నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించి.. ప్రశాంతతో కూడిన నిద్రకు మెంతులు సహకరిస్తాయి.
ఉసిరి రసం ఉసిరి జ్యూస్ తాగడం వల్ల.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే.. రోజుకు ఒకసారి ఉరిసి జ్యూస్ తాగండి
.డెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి.
బొప్పాయి రసం రోజుకి ఒక గ్లాస్ బొప్పాయ రసం తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు. ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కి శక్తినిస్తుంది.
దానిమ్మ జ్యూస్ డెంగ్యూ జ్వరంలో ముందుగా వేధించే పెద్ద సమస్య ప్లేట్ లెట్స్ పడిపోవడం. కాబట్టి.. దానిమ్మ జ్యూస్, బార్లీ గ్రాస్ టీ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ ని పెంచవచ్చు. ప్లేట్ లెట్స్ స్థాయిని పెంచడంలో బార్లీ గ్రాస్ టీ బాగా 

కొలస్ట్రాల్‌ తగ్గాలంటే

శరీరంలో కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది తగ్గాలంటే నిత్యం మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి.. 
  • సాల్మన్‌, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడే పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్‌ కొలస్ట్రాల్‌ను ఇవి మెరుగుపరుస్తాయి. ఈ ఫిష్‌ని గ్రిల్‌ లేదా బేక్‌ చేసి తినాలి. వేపుళ్లు చేసుకుని మాత్రం తినొద్దు.
  • మొనోసాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అవకాడో, పల్లీలు, బటర్‌, బాదంపప్పులు గుండెకు ఎంతో మంచివి. ఇవి కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఆలివ్‌, పల్లీ నూనెల్లో మొనోసాచ్యురేట్స్‌ పుష్కలంగా ఉంటాయి.
  • నట్స్‌ తినడం వల్ల కూడా కొలస్ట్రాల్‌ బాగా తగ్గుతుంది. వీటిల్లో మొనోసాచ్యురేటెడ్‌, పాలీఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇది ఎల్‌డిఎల్‌ని అంటే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నట్స్‌ అంటే బాదం, వాల్‌నట్స్‌ వంటి వాటిల్లో గుండెను ఆరోగ్యంగా ఉంచే పీచుపదార్థాలు ఉన్నాయి. అంతేకాదు వీటిల్లో విటమిన్‌-ఇ, సొలీనియంలు కూడా ఉన్నాయి.
  • ధాన్యాలు, ఓట్స్‌ వల్ల కూడా కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. ఓట్స్‌లో ఫైబర్‌ ఉంటుంది. దీన్లోనే కాకుండా బార్లీ, బ్రౌన్‌రై్‌సలు తీసుకుంటే కూడా కొలస్ట్రాల్‌ బాగా తగ్గుతుంది. బీన్స్‌, యాపిల్స్‌, కేరట్స్‌లలో పీచుపదార్థం బాగా ఉంది.
  • బీన్స్‌, కాయధాన్యాలు, బటానీల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. పప్పుల్లో కూడా పీచుపదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్‌ తక్కువగా ఉంటుంది. బీన్స్‌లో లెసిథిన్‌ అనే పోషకపదార్థం ఉంటుంది. ఇది కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
  • పళ్లల్లోని పీచుపదార్థాల వల్ల కూడా కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. యాపిల్స్‌, కమలాలు, ద్రాక్ష వంటి పళ్లల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని ఫైబర్‌ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పీచుపదార్థాలు బాగా ఉన్న సిలీయం, బార్లీ, యాపిల్స్‌, పియర్స్‌, కిడ్నీబీన్స్‌లు తింటే శరీరానికి మంచిది.
  • యాంటీ ఆక్సిడెంట్లు కొలస్ట్రాల్‌దెబ్బతినకుండా కాపాడతాయి.
  • వాల్‌నట్స్‌లో మొనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇది కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా ఎల్‌డిఎల్‌ (బ్యాడ్‌) కొలస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
  • వెల్లుల్లి రోజూ తింటే బ్యాడ్‌ కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. మంచి కొలస్ట్రాల్‌ పెరుగుతుంది.