Thursday, November 5, 2015

మెరిపించే సెనగపిండి...!

ఈ కాలంలో రకరకాల చర్మ సమస్యలు ఇబ్బంది పెడతాయి. వాటన్నింటికీ సెనగపిండితో పరిష్కారం సాధించొచ్చు.

• సెనగపిండిని అప్పుడప్పుడూ సున్నిపిండిలా వాడుకోవచ్చు. దీనివల్ల చర్మంపై పేరుకొన్న మురికి తొలగిపోయి... శుభ్రపడుతుంది. టాన్‌కూడా వదిలిపోతుంది. చర్మం సున్నితంగా మారుతుంది. మృతకణాలూ తొలగిపోతాయి.

• నాలుగు చెంచాల సెనగపిండిలో చెంచా పాలూ, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమం తయారు చేయాలి. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి.. ముఖానికి రాసుకోవాలి. పావుగంటపాటు మర్దన చేయాలి. కాసేపు అలా వదిలేసి చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలాచేయడం వల్ల నల్ల మచ్చలు తగ్గి చర్మం కాంతిమంతంగా మారుతుంది.

• జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి వేసవిలోనే కాదు.. చలికాలంలోనూ ఇబ్బంది తప్పదు. అలాంటప్పుడు నాలుగు చెంచాల సెనగపిండిలో కొద్దిగా పెరుగూ, పాలూ కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేసుకుంటే చర్మంపై పేరుకొన్న మురికీ, దుమ్మూ తొలగిపోతాయి. జిడ్డు వదిలిపోతుంది.

• మొటిమల సమస్యలతో బాధపడుతున్నప్పుడు చెంచా సెనగపిండిలో కొద్దిగా గంధం, కొన్ని పాలూ, చిటికెడు పసుపూ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. పూతలా రాసుకొని ఆరాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.

• కొందరికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. అలాంటి వారు సెనగపిండిలో పెరుగూ, నిమ్మరసం, పసుపూ చేర్చి నలుగులా పెట్టుకోవాలి. కడిగేసుకున్న తరవాత నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. నిమ్మరసం, పెరుగూ తేమ శాతాన్ని పెంచి నలుపుదనాన్ని పోగొట్టి చర్మాన్ని మెరిపిస్తాయి.

• మూడు చెంచాల సెనగపిండిలో చెంచా ఓట్స్ పొడీ, అరచెంచా మొక్కజొన్న పిండీ, కొన్ని పాలూ చేర్చి స్క్రబ్ చేసుకోవాలి. తరవాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి.. చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

No comments:

Post a Comment