Monday, November 9, 2015

చేతి వేళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ గుట్టు!

అరచేతి గీతలతో భవిష్యత్తు తెలుస్తుందో లేదో గానీ.. వేళ్ల పొడవును బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు! విచిత్రంగానే అనిపించినా.. చూపుడు వేలు కన్నా ఉంగరం వేలు పొడవుగా గలవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువని పరిశోధకులు చెబుతుండటమే దీనికి నిదర్శనం. కొన్ని అధ్యయనాలూ దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. అంతమాత్రాన ఉంగరం వేలు పొడవుగా ఉన్నవారు అప్పుడే భయపడిపోకండి. దీనిపై ఇంకా చాలా అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇతరత్రా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కారకాలు గలవారిలో మాత్రం వేళ్ల తీరును కొట్టిపారేయటానికి లేదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఉంగరం వేళ్ల కన్నా చూపుడు వేళ్లు పొడవుగా గలవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు 33% తక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై మరో కోణంలో అధ్యయనం చేయగా.. చూపుడు వేళ్ల కన్నా ఉంగరం వేళ్లు పొడవుగా గలవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతున్నట్టు తేలింది. దీనికి కారణం లేకపోలేదు. మన శరీరం వృద్ధి చెందటంలో హోక్స్ (హెచ్ఓఎక్స్) జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. పిండస్థ దశలో ప్రోస్టేట్ గ్రంథి, మూత్రపిండాల వంటి అవయవాల విషయంలోనే కాదు.. వేళ్ల అభివృద్ధిలోనూ ఇవి పాలు పంచుకుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ కణితుల్లో హోక్స్ జన్యువుల నిష్పత్తి అస్తవ్యస్తంగా ఉంటున్నట్టూ బయటపడింది. క్యాన్సర్లు తలెత్తటంలో పాలు పంచుకునే టెస్టోస్టీరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లతో హోక్స్ జన్యువులు ఎలా చర్య జరుపుతున్నాయో అనేది ఇంకా స్పష్టంగా బయటపడలేదు. కానీ ఉంగరం వేలు పెద్దగా ఉండటానికీ ఈస్ట్రోజెన్ హార్మోన్‌కూ సంబంధం ఉండటం మాత్రం నిజం. తల్లికడుపులో ఉండగా ఈస్ట్రోజెన్ స్థాయులు ఎక్కువగా గలవారిలో ఉంగరం వేళ్ల కన్నా చూపుడు వేళ్లు పొడవుగా ఉంటున్నట్టు తేలింది కూడా. అందువల్ల హోక్స్ జన్యువులకూ ఈస్ట్రోజెన్, టెస్టోస్టీరాన్ హార్మోన్లకూ గల సంబంధంపై మరింత అధ్యయనం చేస్తే.. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కొత్త చికిత్సలను రూపొందించటమే కాదు, మున్ముందు వేళ్ల పొడవును బట్టే జబ్బు ముప్పును కొంతవరకు అంచనా వేసే వీలుంటుందనీ ఆశిస్తున్నారు.

No comments:

Post a Comment