మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన
శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం
తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి
నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు
అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్
కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక
రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత
ఉప్పు అవసరం?
జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు
ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8
నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను
కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో
సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే
సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా
అలసటకూ చికాకుకూ లోనవుతాడు.
శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ
ఉన్నపుడు మెదడులోని దప్పిక కేంద్రం ప్రేరేపించబడి మిమ్మల్ని మరిన్ని నీళ్ళు
తాగమంటూ ప్రోద్భలపరుస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడటంవల్ల
మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జింప చేయలేక పోతాయి.
అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం హెచ్చుతుంది. ద్రవపరిమాణం పెరిగి ద్రవాన్ని
ఇముడ్చుకొనే ఖాళీ పెరగకపోవటంతో లోపలవత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన
వత్తిడినే మనం హైపర్ టెన్షన్ (బీపీ) అంటున్నాము. ఉప్పుకు ఎక్కువ
తీసుకోకూడదని తెలిసినా కూడా చాలామంది రోజుకు 10 గ్రాములకు బదులు సుమారు 15
గ్రాములదాకా తీసుకుంటారు. ఇలాంటి సందర్బంలో మూత్రపిండాలు శరీరంలోకి
చేరుకున్న అదనపు ఉప్పను మూత్రం ద్వారా విసర్జించి సమతుల్యతను కాపాడుతాయి.
అయితే, బీపీ ఉన్నవాళ్లు కొందరు ఉప్పను అసలు తీసుకోరు. ఇలా చేయడం కూడా
తప్పే. ఎంత హైవర్ టెన్షన్ ఉన్నవాళ్లు కూడా ఉప్పును తీసుకోవడం పూర్తిగా
మానేయ కూడదు. ఒక పరిమితిలో తక్కువగా తీసుకోవాలి. బీపీ పేషేట్లు కాకుండా
దిగువ సూచించిన పేషెంట్లు కూడా ఉప్పు తక్కువ వాడాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు
తక్కువ ఉప్పు తీసుకోవాలి. లేకపోతే నెలసరికి వారం ముందు శరీరంలోకి నీరు చేరి
ఉబ్బినట్టు తయారవుతారు. కిడ్నీలు పూర్తిగా పాడయిపోయి డయాలిసిస్
చేయించుకుంటున్న పేషేంట్లు ఉప్పును కొద్దిగా కాదు కదా అసలు తీసుకోకూడదు.
సిర్రోసిన్ అనబడే లివరుకు సంబంధించిన వ్యాధి ముదిరిపోయిన పేషేంట్లు ఉప్పను
పూర్తిగా మానేయాలి. హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న వాళ్ళు, గుండెకు
రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యం తక్కువ కల పేషేంట్లు ఉప్పుకు దూరంగా ఉండాలి.
వీళ్ళకు కాళ్ళలో నీరు చేరటం, ఊపిరి అందకపోవటం లాంటి లక్షణాలు ఉంటాయి.
ఫాస్టు ఫుడ్స్ ఎక్కువగా తినేవారికి ఎముకలపై ఉండే త్వచం పలుచబడడమే కాకుండా
ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. అందుకనే ఉప్పు
తక్కువగా తినాలి.
ఉప్పు ఎలా తగ్గించుకోవాలి ?
మనకు
రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా
ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు.
1. నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది.
2. ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు.
3. ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.
4. డబ్బాల్లో నిల్వ ఉన్న పదార్థాలకు బదులుగా తాజా పళ్లు తీసుకోవాలి.
5. ఉప్పుతో తయారు చేసిన స్నాక్స్, చిప్స్‌ను బాగా తగ్గించాలి.
6. ఉప్పు కలుపుకోకుండా మజ్జిగ తీసుకోవాలి.
7. పొటాషియం ఎక్కువుండే అరటిపళ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తాయి.
8. అధిక బరువు ఉన్నవారు తమ ఎత్తు, వయసుకు తగ్గ బరువుండాలి.
9. ఆల్కహాలు, ధూమపానం మానాలి.
10. ఆహార పదార్థాల మీద అదనంగా ఉప్పు చల్లుకోవడం మానాలి.
11. కూల్‌డ్రింక్స్ మానాలి.
No comments:
Post a Comment