* మీ ఆరోగ్యం మీ చేతుల్లో!
ఆరోగ్యంగా ఉండాలంటే, పుష్టికరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం చాలా
కీలకమని అందరికీ తెలుసు. అయితే, ఎప్పుడూ వాటి గురించే ఆలోచించకుండా కాస్తంత
రిలాక్స్ అవడం కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమే. అయితే, పొద్దున్నే జోరున వాన కురుస్తూ జిమ్‌కు వెళ్ళడానికి
వీలు లేకపోవచ్చు. అలాగే, మరీ అతిగా చలిగా ఉంటూ, బద్ధకం అనిపించవచ్చు.
అలాంటి సందర్భాల్లో ఇంట్లోనే ఉంటూనే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా
మార్గాలున్నాయి. సాదాసీదాగా ఆహారం తీసుకుంటూనే, చిన్న చిన్న వ్యాయామాలతో
కాలక్షేపం చేయడం వల్ల ఆనందం, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా అందుకోవచ్చు.
చిరు తిండిగా పాప్‌కార్న్
మధ్యాహ్నం భోజనం తరువాత మళ్ళీ రాత్రి వేళ భోజనం చేసే వరకు ఖాళీ కడుపుతో
ఉండడం ఆరోగ్య రీత్యా సరైనది కాదు. మధ్యలో ఆకలి వేసినప్పుడు ఏవో చిరుతిండ్లు
తింటాం. అయితే, ఆ చిరుతిండ్లు మరీ ఎక్కువైనా, అనారోగ్యకరమైనవి అయినా
ఇబ్బందే. వేపుడు పదార్థాలు, ఏవి పడితే అవి తినడం కాకుండా జాగ్రత పడాలి.
అనారోగ్యకరమైనవి తినే కన్నా ఓ గిన్నెలు తాజా పండ్ల ముక్కలు పెట్టుకొని
తినడం మంచిది. అది కుదరకపోతే, దానికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా
పాప్‌కార్న్ తినవచ్చని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే,
పండ్లు, కాయగూరల కన్నా దాదాపు రెట్టింపు పరిణామంలో పాప్‌కార్న్‌లో యాంటీ
ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ నుంచి, గుండె జబ్బుల
నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా, పాప్‌కార్న్‌లో పీచు పదార్థం
ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. సజావుగా
జీర్ణమవుతుంది. ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా పాప్‌కార్న్ దోహదం
చేస్తుంది. పైపెచ్చు, పాప్‌కార్న్‌లో కేలరీలు తక్కువ. 'బి' విట మిన్లు
ఎక్కువ. ఆరోగ్యవంతమైన చిరుతిండ్లు తినడం వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది.
మెరుగైన రీతిలో ఏకాగ్రత ఏర్పడు తుంది. దాంతో, పనిలో సామర్థ్యం కూడా పెరుగు
తుంది. ఏతావతా, ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే చిరుతిండ్లను తినకుండా
పాప్‌కార్న్‌కు పరిమితమైతే భేషుగ్గా ఉంటుందన్న మాట!
హాయిగా నవ్వండి!
ఒక్కోసారి ఎంతో అలసటగా అనిపిస్తుంటుంది. దాంతో, ఓ పట్టాన జిమ్‌కు
వెళ్ళబుద్ధి కాదు. ఎక్సర్‌సైజులు చేయాలనీ అనిపించదు. అలాంటి పరిస్థితుల్లో
కొద్దిగా బద్ధకించి, అడపాదడపా ఎక్సర్ సైజులకు డుమ్మా కొట్టేసినా ఫరవాలేదు.
కాకపోతే, ఎక్సర్‌సైజులు చేయకుండానే చేసినంత ఫలితం రావాలంటే, ఓ చిన్న
చిట్కా ఉందంటున్నారు. అది ఏమిటంటే - పడీ పడీ నవ్వడం! కడుపు నొప్పి పుట్టే
లాగా తెగ నవ్వడం వల్ల ఆనందమే కాక, మరో ఉపయోగం కూడా ఉంది. అలా నవ్వడమనేది ఓ
మోస్తరు స్థాయిలో వ్యాయామం చేసిన దానితో సమానమని పరిశోధనల్లో తేలింది.
పగలబడి నవ్వడం వల్ల మన మానసిక స్థితి మెరుగవుతుంది.అంతేకాక, అధిక రక్తపోటు
తగ్గుతుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పుంజు కుంటుంది. కాబట్టి, రోజూ
కనీసం ఓ పావుగంట సేపు హాయిగా నవ్వుకోవడమనేది మన శరీరంలోని రక్తనాళాల
పనితీరును మెరుగు పరుస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, కనీసం
ఎక్సర్‌సైజ్ ఎగ్గొట్టిన రోజైనా, కడుపారా నవ్వుకోవడానికి ప్రయత్నించాలన్న
మాట.
కాస్తంత చాక్లెట్ తినండి!
రోజు విడిచి రోజు
కొద్దిగా డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణుల ఉవాచ.
ఎందుకంటే, డార్క్ చాక్లెట్‌లో 'ఎపి కటెచిన్' అనే పదార్థం ఉంటుంది.
ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు కండరాలు ఏ రకంగా స్పంది స్తాయో, అదే రకమైన స్పందన
కలిగేలా ఈ పదార్థం తోడ్పడుతుందట!
కండరాలు వయస్సు మీరడాన్ని ఇది
నెమ్మదింపజేస్తుందట! అలాగే, డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లుం టాయి.
అవి ఆరోగ్యాన్ని కాపాడడమే కాక, ముఖంపై మడతలు పడడాన్ని అడ్డుకుంటాయి.
అయితే, చాక్లెట్‌తో ఉపయోగాలు ఉన్నాయ న్నారు కదా అని అదే పనిగా తినేయకండి! ఏదైనా మితంగా ఉంటేనే ఉపయోగమని గ్రహించండి.
ఆహ్లాదభరిత సంగీతం వినండి!
సంగీతం వల్ల ఉపయోగాల గురించి అందరికీ తెలిసిందే. ఆరోగ్యవంతమైన జీవనశైలితో
గడపాలంటే, అందుకు సంగీతం కూడా కీలకం. సంగీతం వినడం వల్ల మానసిక స్థితి
మెరుగవుతుంది. అంతే కాకుండా, మానసికమైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. వ్యాధులపై
యాంటీ బాడీల పోరాట స్థాయిని కూడా అది పెంచుతుంది. అలాగే, కార్డియో
వాస్క్యులర్ పరంగా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చివరకు నొప్పి
లాంటి బాధల నుంచి సాంత్వన పొందడానికి కూడా సంగీతం పనికొస్తుందని కొంతమంది
నిపుణులు వెల్లడించారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికీ, మానసిక
ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ కూడా సంగీతం ఉపకరిస్తుందని వారి మాట. కాబట్టి,
ఇంట్లో ఉన్నప్పుడు కూడా వెనుక నుంచి సన్నటి స్వరంలో సంగీతం వినిపించేలా
చూసుకోవడం మెరుగని వారు సూచిస్తున్నారు.
కాసేపు బయట నడవండి!
మన శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యమైనదని చాలా మంది మర్చిపోతుంటారు.
విటమిన్ డి గనక లోపిస్తే, ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది.కానీ,
విటమిన్ డి కావాలంటే, ఒంటికి సూర్యరశ్మి తగలడం అవసరం. కాబట్టి, వీలైనంత
వరకు ప్రతి రోజూ కాసేపు ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తగిలేలా షికారు
చేయండి. సూర్య ప్రతాపం మరీ ఎక్కువగా ఉండని ఈ సమయాల్లో తిరగడం వల్ల మన
శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి అది
అత్యవసరమైన పోషకం.
ఏతావతా, రోజూ వ్యాయామం చేయాలి. అలా వ్యాయామం
చేస్తున్నప్పటికీ, పైన చెప్పిన సలహాలు, సూచనలు పాటించడం మంచిది. పైపెచ్చు,
ఒకటీ, అరా రోజులు వ్యాయామం కుదరనప్పుడు ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో
మహత్తరంగా తోడ్పడతాయి.
No comments:
Post a Comment