Friday, October 9, 2015

పుదీనా.. ఆరోగ్య ఖజానా..!

పుదినా ఓ దివ్య ఔషధం.. తరుచూ తింటే పలు రకాల జబ్బులను దూరం చేస్తుంది. నోటి దుర్వాసనను మటుమాయం చేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుతుంది.
మామూలు వంటలను సైతం తన సువాసనతో ఘుమఘుమ లాడించే పుదీనాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వంటల్లో వాడేందుకే కాకుండా, వివిధ రకాల జబ్బులను నివారించే దివ్య ఔషధంలా పుదీనా పనిచేస్తుంది. కూరల్లో వేసుకునే వివిధ రకాల ఆకు కూరల్లో పుదీనాకు ప్రత్యేక ఔషధ గుణాలున్నాయని ప్రాచీన కాలానికి చెందిన గ్రీకు, రోమన్లు తొలుత గుర్తించినట్లు చెబుతారు. రోమన్లు సువాసన కోసం పుదీనాను వంటల్లో ఉపయోగించడమే కాకుండా దాని రసాన్ని డైనింగ్ టేబుల్‌పై చల్లుకొని ఆహ్లాదం పొందేవారు. దీని ఆకులు తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారి నమ్మకం. ఎథెన్స్ నగరానికి చెందిన ప్రజలు తమ శరీరం నుంచి వస్తున్న చెమట వాసనను తొలగించేందుకు పుదీనా రసాన్ని స్ప్రేగా ఉపయోగించేవారట!

• పుదీనా ప్రత్యేకతలు..

పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనం చేసే ఔషధంలా పనిచేస్తాయిని పలు పరిశోధనలు నిగ్గు తేల్చాయి. దీని నుంచి తీసే మెంథాల్‌ను తల, గొంతు నొప్పి నివారణకు వాడుతున్నారు.

• దుర్వాసనకు చెక్.. !

పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటి నుంచి వచ్చే దుర్వాసనను నివారించవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టి పడడమే కాక, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ దూరమవుతాయి.
5,480 మైక్రో గ్రాముల విటమిన్లు
పుదీనా ఆకుల్లో సుమారు 5,480మైక్రో గ్రాముల విటమిన్లు జిటా కెరోటిన్ రూపంలో వెలువడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే ఖనిజ లవణాలు ముఖ్యంగా కాల్షియం 200, గ్రంధకం 0.84, భాస్వరం 0.62, మెగ్నీషియం 60, ఇనుము 15.6, మిల్లీ గ్రాముల్లో లభిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో విటమిన్ సీ 33మిల్లీ గ్రాములు ఉంటాయి. ఈ ఆకుల్లో ఉన్న పీచుపదార్థాలు పెద్ద మొత్తంలో ఉన్న మాంసకృత్తులను సైతం సులభంగా జీర్ణం చేసేందుకు దోహదపడతాయి.

• ఇంకెన్నో లాభాలు...

పుదీనా టీలో కొంచెం తేనె కలిపి తాగితే అరగని పదార్థాలు సులువుగా జీర్ణమవుతాయి.
కడుపు నొప్పితో బాధపడుతున్న వారు మరిగించిన పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
వేడివేడి పుదీనా టీ తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
పుదీనా ఆకుల రసాన్ని రోజూ రెండు స్పూన్లు తేనెలో కలిపి పిల్లలకు తాగిస్తే కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోతాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు పుదీనా ఆకులను ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది.

No comments:

Post a Comment