Thursday, October 8, 2015

దగ్గుకు దండోపాయ మార్గాలివే..!



దగ్గుకు దండోపాయ మార్గాలివే..!
వాతావరణంలో కలిగే మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల పలురకాల ఆరోగ్య సమస్యల బారిన పడడం సర్వసాధారణం. వీటిలో దగ్గు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది దగ్గు తగ్గించుకోవడానికి మాత్రలు వేసుకోవడం, దగ్గుమందు తాగడం, గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కిలించడం.. ఇలా దాదాపు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయినా దగ్గు ఏమాత్రం తగ్గకుండా వేధిస్తుంటుంది. ఇలాంటి సమయంలోనే దగ్గుపై ఆఖరి అస్త్రంగా ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు పనికొస్తాయి. ఇవి దగ్గుపై ప్రభావాన్ని చూపి, సమస్య నుంచి సత్వర ఉపశమనాన్నిస్తాయి. మరి అవేంటో తెలుసుకుని మనమూ ఓసారి ప్రయత్నిద్దామా..!
• ఆగకుండా వస్తోందా?
కొంతమంది నిమిషం గ్యాప్ లేకుండా నిరంతరాయంగా దగ్గుతూనే ఉంటారు. ఇలాంటివారు కొద్దిగా అల్లాన్ని తీసుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక కప్పు నీటిలో వేసి కాసేపు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి, ఆ తర్వాత తీసుకోవాలి. దీనికి అవసరమైతే కాస్త తేనె, నిమ్మరసం కూడా కలుపుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు.. దగ్గు తగ్గే వరకు నిర్ణీత వ్యవధిలో కొద్ది కొద్దిగా అల్లం లేదా వెల్లుల్లి ముక్కల్ని నమలడం వల్ల కూడా సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
• పొడిదగ్గుకు..
పొడిదగ్గు చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎవరితోనైనా ఏమైనా మాట్లాడదామని నోరు తెరిస్తే చాలు.. మాటల కంటే ముందు దగ్గు వచ్చేస్తుంటుంది. ఇలా ఎక్కువగా దగ్గడం వల్ల ఛాతిలో మంట కూడా వస్తుంది. ఇలాంటి వారికి పసుపు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పాత్రలో అరకప్పు నీటిని వేడిచేయాలి. నీరు మరుగుతున్న సమయంలో చెంచా పసుపు, పావు చెంచా మిరియాల పొడి, రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి.. కనీసం ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మరిగించాలి. దీన్ని ఒక గ్లాసులో వడకట్టి, గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి చెంచా తేనె కలుపుకొని తాగాలి. లేదంటే గోరువెచ్చటి నీటిలో కాస్త పసుపు, కాస్త తేనె వేసుకుని బాగా కలుపుకొనైనా తాగచ్చు. ఇలా క్రమంగా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్య నుంచి బయటపడచ్చు.. ముఖ్యంగా పొడిదగ్గుతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.
• ఛాతీలో మంటా?
అలాగే నిరంతరంగా దగ్గడం వల్ల ఛాతీలో మంట రావడం సర్వసాధారణం. మరి దగ్గుతో పాటు దీన్ని కూడా తగ్గించుకోవాలంటే కాస్త వేడిగా ఉండే పాలలో కొద్దిగా తేనె వేసి బాగా కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్, పొడిదగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే పరగడుపున ఒక చెంచా తేనె తీసుకున్నా ఫలితం ఉంటుంది.
• మరిన్ని..
* రాత్రంతా నానబెట్టిన బాదంపప్పుల్ని ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం దీనికి ఒక చెంచా వెన్న కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని రోజుకు నాలుగైదు సార్లు సమస్య తగ్గేంతవరకూ తీసుకోవాలి.
* కొబ్బరినూనె, నిమ్మరసం.. కొద్ది మోతాదుల్లో తీసుకుని దానిలో కాస్త తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
* క్యారట్ జ్యూస్ ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. దగ్గునూ తగ్గిస్తుంది. దీన్ని మామూలుగా తాగడం అంత రుచిగా అనిపించకపోతే ఇందులో కాస్త తేనె కలుపుకోవచ్చు.
* పుదీనాతో తయారుచేసిన టీ తాగినా లేదంటే మరిగించిన నీటిలో రెండు మూడు చుక్కల పుదీనా నూనెను వేసి ఆవిరి పట్టినా దగ్గు నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.
దగ్గును తగ్గించుకునే కొన్ని సహజసిద్ధమైన మార్గాలేంటో తెలుసుకున్నారు కదా! అయితే ఈ చిట్కాలన్నీ ప్రయత్నించినప్పటికీ ఒకటి రెండు వారాల వరకు దగ్గు తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

No comments:

Post a Comment