Sunday, March 10, 2013

* బాదంపప్పు ( Almond )


* బాదంపప్పు ( Almond )
బాదం పాలు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. బాదం నూనె వాడితే చర్మం నునుపుగా తయారవుతుంది. బాదం పప్పు ఉపయోగిస్తే స్వీట్లకు మంచి రుచి వస్తుంది. రాయల్ దినుసుగా పేరున్న బాదంపప్పు మన వంటింటి దినుసుల్లో మహారాజ వైభోగం దక్కించుకోవడం వెనకాల పెద్ద కథే ఉంది.

గుండెకు, మెదడుకు మేలు చేసేదిగా, ఆరోగ్యప్రదాయినిగా ఏ పప్పుకూ లేనన్ని సుగుణాలు బాదం పప్పుకు ఉన్నాయి. అహ్.. అంటూ అందరిచేత భేషైన ప్రశంసలు అందుకుంటున్న బాదం చెట్టు రొససెయె కుటుంబానికి చెందినది. బాదం పుట్టుక మధ్యధరా ప్రాంతమైనా అక్కడి నుంచి ఉత్తర ఆఫ్రికా, దక్షి యూరప్ దేశాలకు విస్తరించి అటు నుంచి రవాణా సదుపాయాల ద్వారా ప్రపంచమంతా తిరిగింది. బాదం పప్పు ఎంత పాతదంటే క్రీ.పూ 1325 లో ఈ డ్రై ఫ్రూట్ ఈజిప్టు టూంబ్స్‌లోనూ చోటుచేసుకున్నట్టు పురాతత్త్వశాస్త్రవేత్తలు కనిపెట్టి మరీ తెలిపారు. యురోపియన్ దేశాలలోని రాయల్ బొటానికల్ గార్డెన్‌లో బాదం చెట్టుకి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. జర్మనీ, నార్త్ ఐలాండ్ దేశాలలోనూ దీనికి విరివిగా ప్రాచుర్యం ఉన్నట్టు తెలుస్తోంది.

లాటిన్‌లో అమండోలా, గ్రీక్‌లో అమిగ్డాలా, ఇటాలియన్‌లో మండోర్లా, బ్రిటన్‌లో అ్‌హ-మండ్, తెలుగులో బాదం అని పిలుచుకునే ఆల్మండ్‌కు పోషకాల లిస్టే కాదు పేర్ల లిస్ట్ కూడా ఎక్కువే ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాదంపప్పు దిగుబడి 2006లో 1.76 మిలియన్ టన్నులు ఉన్నట్టు లెక్క తేలింది. అయినా భారతదేశంలో వీటి దిగుబడి గురించి పెద్దగా పేరు వినిపించడం లేదు. కాకపోతే మనవాళ్లు గుండెకు, మెదడుకు బాదం చాలా మంచిదని భావిస్తారు.

బాదం పూలు తెల్లగా ఉండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింక్ కలర్‌లో ఉంటాయి. నాటిన ఐదు సంవత్సరాలకు దిగుబడి మొదలవుతుంది. పుష్పించిన ఆరేడు నెలల తర్వాత కాయలు పక్వానికి వస్తాయి. బాదంకాయ పై భాగం పీచు కలిగిన గట్టి పెంకు ఉండి లోపల బాదం గింజ ఉంటుంది. దీనిలో కొవ్వులు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి.

బాదంపప్పే ఖరీదు ఎక్కువైనప్పుడు, ఇక దీని నూనెకు ఎంత ఉండాలి... అందుకే బాదం నూనెను వంటలలో ఉపయోగించరు. చర్మ సంరక్షణిగా, కేశసంవర్ధినిగా ఉపయోగిస్తారు. బాదం నూనె ఎసెన్సియల్ ఆయిల్ వర్గానికి చెందినది. దీనిని అరోమా థెరపీ, మసాజ్ థెరపీలలో ఉపయోగిస్తారు. సుగంధ నూనెలు వాసన త్వరగా కోల్పోకుండా ఉండటానికి బాదం నూనెను కలుపుతారు.

బాదం నూనెను మేనికి మర్దనా చేయడం వల్ల మెరుపు వస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. కళ్లచుట్టూ నల్ల చారికలను తగ్గిస్తుంది. పెదవుల పగుళ్లను, చర్మం ముడతలను తగ్గిస్తుంది. చిన్న పిల్లల సబ్బులలోనూ, మర్దనా నూనెలలోనూ బాదం నూనెను ఉపయోగిస్తారు. అంతేకాదు కొన్ని హాట్ హాట్ వంటకాలలోనూ బాదంపప్పును పిండి చేసి మరీ ఉపయోగిస్తారు. ఖరీదులోనే కాదు, రుచిలోనూ అగ్రభాగంలో ఉంటుంది బాదంపప్పు.

No comments:

Post a Comment