Tuesday, March 12, 2013

* మిరియాలు



* మిరియాలు
సుగంధద్రవ్యాలలో రారాజు మిరియం.అందుకే దీన్ని కింగ్ ఆఫ్ స్పైసెస్ అన్నారు. ప్రపంచంలో మిరియాలకు పుట్టినిల్లు నూటికి నూరుపాళ్లూ భారతదేశమే. మిరపకాయ పరిచయం లేని రోజుల్లో వంటకాల్లో మిరియాన్నే విరివిగా వాడేవారట పూర్వీకులు. ముందొచ్చిన చెవులకన్నా... అన్న టైప్‌లో మిరప ఎంత మిడిసిపడినా మిరియంలోని ఘాటు, టేస్ట్ ముందు దిగదుడుపే. అందుకేనేమో యురోపియన్ వంటకాల్లో మిరియం పెప్పర్పేరుతో టేబులెక్కి కేక పుట్టిస్తోంది. పోపులపెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దలమాట. జలుబు, దగ్గు, గొంతు గరగర, ముక్కుదిబ్బడ, అజీర్తి, క్రిమి, జీర్ణశక్తిని పెంచటం, గొంతును శుభ్రపరచటం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, మూలశంక, కలరా, మలేరియా .... ఏ వ్యాధికైనా ఒకే మందు... అదే మిరియం. వేల రకాల వంటకాలకైనా మేలిమిరుచిని తీసుకువచ్చే ఘనాపాఠి మిరియం.

మిరియాలంటే నల్లటివే తెలుసు మనకు. కాని వీటిలో తెల్లనివి, ఆకుపచ్చనివి, ఎర్రనివి, అరుదుగా గులాబిరంగువి కూడా ఉంటాయి. పీచు, ఐరన్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్లలో లభించే మిరియాన్ని కాలామిర్చి అని కూడా అంటారు. మిరియాల మొక్క శాస్త్రీయనామం పైపర్ నీగ్రమ్ లిన్. ఇది 10-15 సెంటిమీటర్ల వరకు పెరిగే తీగ జాతికి చెందినది. మిరియాలు గుండ్రంగా ఆకుపచ్చగా ఉండి పండినప్పుడు ఎర్రగాను, ఎండినప్పుడు ముడతలు పడి నల్లగా అవుతాయి. నవంబర్ - ఫిబ్రరి నెలలో ఈ పంట కోతకు వస్తుంది.

కేరళలో విరివిగా పండే ఈ పంటను మన రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో, కాఫీ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. మనం కాస్త చిన్న చూపు చూశామని కినుక వహించిందేమో, ఒకప్పుడు మిరియాల పంటలో అగ్రస్థానంలో ఉన్న మన దేశ స్థానాన్ని ఇప్పుడు వియత్నాం దేశానికి అప్పగించింది. వాడకంలో ఆ స్థానాన్ని అమెరికా కొట్టేసింది. పోటాపోటీగా ఎవరెంత ముందుకు వచ్చినా మన తె లుగింటి మనసులో ఈ దినుసుకు ఎప్పటికీ అగ్రస్థానమే.

No comments:

Post a Comment