Tuesday, March 12, 2013

* ఏలకులు


* ఏలకులు
హాట్‌కైనా, స్వీట్‌కైనా టేస్టులో భిన్నమైన రుచిని తేవడంలో ఘనాపాఠి దినుసు ఏలకులు.సుగంధ ద్రవ్యాలలో రారాణిగా పేరొందిన ఏలకులు వంటింటి షెల్ఫ్‌లో లవంగంతో చేరి గాజు సీసాలో ఘాటుగా జోడీ కట్టినా నా రూటే సెపరేట్అన్నట్టుగా ఉంటుంది.

ఇలాచీఅని ఇష్టంగా పిలుచుకునే ఏలకులను ప్రాచీనకాలంలోనే మనవారు సుగంధ ద్రవ్యంగా వాడినట్టు చరిత్ర చెబుతోంది. 2వ శతాబ్దంలో సుశ్రుతుడు రాసిన చరకసంహితలోను, 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రంలోనూ ఏలకుల ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది.కార్డ్డమమ్అని పిలిచే ఆంగ్లేయులూ ఏలకుల పంటలో ఘనాపాఠిగానే పేరుతెచ్చుకున్నారు.

మన దేశంలో ఏలకుల ఉత్పత్తిలో అగ్రస్థానం సిక్కిం కొట్టేసినప్పటికీ దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండలు ఏలకులకు జన్మస్థానంగా చెబుతారు. శ్రీలంక, బర్మా, చైనా, టాంజానియా... ప్రపంచంలో ఎన్నిచోట్ల ఏలకులు పండినా, భారతదేశపు ఏలకులు అత్యుత్తమైనవిగా పేరుగాంచాయి. అంతేకాదు ప్రపంచంలో ఏలకులను అత్యధికంగా పండించేది మన దేశమే. కుంకుమపువ్వు తర్వాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరున్న ఏలకులను గ్రీకులు, రోమన్లు అత్తరు తయారీలో వాడేవారట.

ఏలకుల మొక్క పొదలాగ మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్కను విత్తనాల ద్వారా లేదా కణుపుల ద్వారా పెంచవచ్చు. నాటిన మూడేళ్ల తర్వాత ఉత్పత్తిని ఇస్తుంది. ఈ కాయలను సగం పండగానే కోస్తారు. వీటిని ఎండలో కాని, యంత్రాల సాయంతో గాని ఆరబెడతారు. ఉత్తమమైన వాటిని గ్రేడ్ చేస్తారు. నలుపు, తెలుపు, పచ్చని రంగులలో ఉండే ఏలకులలో ఆకుపచ్చనివి అన్నింటికన్నా అత్యుత్తమమైనవి.

అరేబియన్ దేశాలలో ఏలకులను కాఫీతోను, మిగిలిన దేశాలలో తేయాకుతోనూ కలిపి పానీయంగా సేవిస్తారు. మిఠాయి, కేక్, పేస్ట్రీలలోనే కాదు మన దేశంలో ఘాటైన వంటల్లో మసాలా దినుసుగానూ ఏలకులను వాడతారు.

ఏలకులను సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగానూ వాడతారు. అజీర్తి, మలబద్దకం, అల్సర్లు, ఆస్తమా, జలుబు, సైనస్, కలరా, తలనొప్పి, చెడు శ్వాస.. వంటి ఎన్నో ఆరోగ్యసమస్యలకు ఏలకులు దివ్యౌషధం.

No comments:

Post a Comment