Friday, February 21, 2014

బీట్రూట్ రసంతో నిత్య యవ్వనం!


వయసు పెరుగుతున్నప్పటికీ యవ్వనంతోనే ఉండాలని ఉందా?.. దీనికి మీరు ఏ అమృతం కోసమో పాకులాడాల్సిన పని లేదు. రోజూ ఓ గ్లాసు బీట్రూట్ రసాన్ని తాగండి.. మీ వయసు పెరుగుతున్నప్పటికీ.. మీరు మాత్రం కుర్రాడిలాగా చలాకీగానే ఉంటారు. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు తాజాగా ఈ విషయాన్ని కనుగొన్నారు. "మానవ దేహంలో రక్తనాళాలు బాగా విచ్చుకొని.. రక్త ప్రసరణ సమగ్రంగా జరిగేలా బీట్రూట్ రసం దోహదపడుతుంది. ముదిమి మీదపడుతున్న వారు, ఊపరితిత్తుల సమస్యలు, హృద్రోగంతో బాధపడే వారు.. ఈ రసాన్ని బాగా తాగాలి.

శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా.. పెద్ద వయసు వారు కూడా కుర్రాళ్లలా చలాకీగా ఉండేందుకు బీట్రూట్ రసం ఉపకరిస్తుంది'' అని బ్రిటన్‌లోని ఎక్సెటర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు క్యాటీ లాన్స్‌లే అన్నారు. బీట్రూట్ రసంలో నైట్రేట్ నిల్వలు అధిక స్థాయిలో ఉంటాయి. దాంతో బీట్రూట్ రసం తాగిన వాళ్ల శరీరంలో రక్త నాళాలు మరింతగా విచ్చుకొనేలా ఈ నైట్రేట్ దోహదపడుతుంది.
ఫలితంగా అలాంటి వారిలో రక్తపోటు తగ్గి.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలా వారి శరీరంలోని అవయవాలన్నింటికీ అధిక స్థాయిలో ఆక్సిజన్ అందుతుంది. నిజానికి.. కేవలం బీట్రూట్‌లోనే కాకుండా.. ఆకు కూరల్లో కూడా నైట్రేట్ లభ్యమవుతుంది. అయితే.. ఆకు కూరలను వండుకొని తినడం కన్నా.. బీట్రూట్ రసాన్ని ఎక్కువ మోతాదులో తాగడం తేలిక. కాబట్టి రోజూ బీట్రూట్ రసాన్ని తాగడాన్ని ఓ అలవాటుగా చేసుకోవాలని పెద్ద వయసు వారికి పరిశోధకులు సూచిస్తున్నారు. కాగా.. ఈ పరిశోధకులు తమ అధ్యయన ఫలితాలను 'జర్నల్ ఆఫ్ ఆప్లైడ్ ఫిజియాలజీ' అనే వైద్య పత్రికలో ప్రచురించారు.

No comments:

Post a Comment