Friday, February 21, 2014

ఒత్తిఢి వలన కలిగే తలనొప్పి ---హోమియో చికిత్స

ప్రస్తుత సమాజంలో క్షణం తీరికలేని జీవనం, నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక.. నిలకడ లేని ఆలోచనలతో యంత్రాలతో పరిగెడుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మానవులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వలన వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది తలనొప్పి. నేడు తల నొప్పితో ఎక్కువగా బాధపడుతున్న వారిలో అధికభాగం స్ర్తిలే దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధికపని భారం. తలనొప్పి వలన ఏ పనీ సరిగ్గా చేయలేక అంతర్గతంగా మదనపడి మానసిక వ్యాధులకు సైతం గురి అవుతున్నారు అంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది.
లక్షణాలు
తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పని చేయడం కుదరదు. దీంతో పాటుగా వాంతి వచ్చినట్లుగా అనిపించడం, శబ్దాలు భరించలేక పోవటం, వెలుతురును సరిగ్గా చూడలేక పోవుట, కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపించుట వంటి లక్షణాలతో బాధ పడుతుంటారు.

కొందరిలో తలనొప్పి ఒకే వైపుకు వచ్చి వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి తలనొప్పిని పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) అంటారు. ఈ నొప్పి తీవ్రత క్రమంగా పెరిగి, క్రమంగా తగ్గుతుంది. నొప్పి భరించలేకుండా ఉండి తల దిమ్ముగా ఉంటుంది.
కారణాలు
అధిక మానసిక ఒత్తిడి మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది.
మెదడు కణాలలో కణుతులు ఏర్పటడంవల్ల కూడా తలనొప్పి వస్తుంది.
తలకు గాయాలు తగలడం గాని కొన్ని సందర్భాలలో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌వల్ల కూడా తలనొప్పి వస్తుంది.
కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడంవల్ల సైతం తలనొప్పి వచ్చి వేధిస్తుంది.
జాగ్రత్తలు
మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామము నిత్యం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలిగి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు లేని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి.
ఫాస్ట్ ఫడ్స్, వేపుళ్ళకు స్వస్తి పలికి పౌష్ఠికరమైన ఆహారం తీసుకోవాలి.
ఆకు కూరలను, వెజిటబుల్స్, తాజా పండ్లు తీసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
నీరు అధికంగా తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రపోతూ ఉండాలి.
ప్రతిరోజూ వేకువజామున లేచి 45 నిమిషాలు పాటు నడవటం అలవాటు చేసుకోవాలి. తద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరిగి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
చికిత్స
తలనొప్పే కదా అని వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్రపరిణామాలకు దారి తీయవచ్చు. హోమియో వైద్యంలో ఈ తలనొప్పికి మంచి చికిత్స కలదు. ఈ వైద్య విధానంలో మందును ఎన్నుకునే ముందు వ్యక్తి యొక్క మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగణనలోకి తీసుకొని మందును ఎన్నుకోవడం జరుగుతుంది. కావున వ్యాధి నివారణ సమూలంగా జరుగుతుంది.
మందులు
సాంగ్వినేరియా:
కుడివైపు వచ్చే తల నొప్పికి ఇది మంచి మందు. తలనొప్పి పోట్లతో కూడి భరించలేకుండా ఉంటుంది. తలనొప్పి వెనుక నుండి ప్రారంభమై ముందుకు వచ్చి తల కుడివైపు భాగములో ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు వీరు చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవటం వలన ఉపశమనం పొందుట గమనించదగ్గన లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
స్పైజీలియా:
ఎడమవైపు వచ్చే తలనొప్పికి ఇది మంచి మందు. తలనొప్పి నుదుటి, కంటి భాగాలలో పోట్లతో కూడి భరించలేకుండా ఉంటుంది. తలనొప్పి వెనుక నుండి ప్రారంభమై ముందుకు వచ్చి తల ఎడమవైపు కణతల భాగములో ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి కదిలిన, కుదిపిన ఎక్కువవడం గమనించ దగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
కాలీబైక్:
తలనొప్పి ముక్కు మొదట భాగంలో ప్రారంభమవుతుంది. తలనొప్పి వచ్చే ముందు చూపు మసక బారుతుంది. తరుచుగా జలుబు చేయడంవలన ఇటువంటి తలనొప్పి వస్తుంది. సైనసైటీస్‌తో బాధపడే వారిలో ఈ నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
సైలీషియా:
తల వెనుక భాగంలో నొప్పి ప్రారంభమయి తలమీదుగా కుడి నుదుటి కంటి భాగంలో ఎక్కువగా ఉంటుంది. నొప్పి తీవ్రత ఉండి తల పగిలి పోతున్నట్లుగా అనిపిస్తుంది. తలనొప్పి వచ్చే ముందు చూపు మసక బారి వస్తువులు సగం వరకే కనిపించుట, అరికాళ్లల్లో, అరిచేతుల్లో చెమటలు ఎక్కువగా ఉండుట గమనించదగ్గన లక్షణం. నొప్పి ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు భరించలేరు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
ఈ మందులే కాకుండా బ్రయోనియా, జెల్సిమియం, సెపియా, నైట్రోమోర్, కాల్కేరియా ఫాస్ వంటి మందులను వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నుకొని వైద్యం చేసినా తలనొప్పి నుండి విముక్తి పొందవచ్చును.

No comments:

Post a Comment