Saturday, February 22, 2014

రక్తనాళాల్లో అడ్డంకలు ఎందుకు?

కొందరిలో నడిచేటప్పుడు పాదాల్లో, పిక్కల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పిని పంటి బిగువన భరించి నడవాల్సి వస్తుంటుంది. ఆర్థరైటిస్, సయాటికానో నొప్పికి కారణమని తేలికగా తీసుకుంటుంటారు. వయసు పైబడటం వల్ల నొప్పి వస్తుండవచ్చని మరికొందరు భావిస్తుంటారు. అయితే అన్ని నొప్పులకు ఆ కారణాలే అయి ఉండకపోవచ్చు.
కాళ్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం కూడా కారణం కావచ్చు. బ్లాక్స్ ఏర్పడటం వల్ల వచ్చే ఈ నొప్పిని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్(పీవీడీ) అంటారు. రక్తనాళాల్లో కొలెస్టరాల్, స్కార్ టిష్యూ మెల్లమెల్లగా డెవలప్ అయి గట్టిపడి రక్తసరఫరాకు ఆటంకం ఏర్పరుస్తుంది. 50ఏళ్లు పైబడిన ప్రతీ 20 మందిలో ఒకరు ఈ పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ బారిన పడుతున్నారు.
గుండె జబ్బులు, డయాబెటిస్, హై కొలెస్టరాల్, అధిక రక్తపోటుతో బాధపడే వారిలోనూ ఏర్పడుతుంది. పొగతాగే అలవాటు ఉన్నవారిలో సైతం ఈ క్లాట్స్‌కనిపిస్తాయి. యుక్తవయసులో స్మోకింగ్ చేయడం ప్రారంభించినట్లయితే త్వరగా ఈ పీవీడీ బారిన పడే అవకాశం ఉంది.
లక్షణాలు
నడుస్తున్నప్పుడు కండరాలు పట్టేయడం, తొడలు, పిరుదుల భాగంలో విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం నడకను ఆపేయాల్సి వస్తుంది. రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కాలి పాదాలు, వేళ్లలో నొప్పి ఉంటుంది. నీరసం, కాళ్లల్లో మంట, నొప్పి, తిమ్మిర్లు ఉంటాయి. కాళ్లు చల్లబడటం, కాళ్ల భాగంలో చర్మం రంగు మారడం, వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది.
నిర్ధారణ
బ్లాక్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కాళ్లలో రక్తప్రవాహాన్ని తెలుసుకోవడం ద్వారా పీవీడీని అంచనా వేయవచ్చు. చీలమండ భాగంలోనూ, మోచేతి భాగంలోనూ హ్యాండ్ డాప్లర్ ను అమర్చి రక్తసరఫరాను తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో రోగికి ఎటువంటి నొప్పి ఉండదు.
వ్యాధి తీవ్రతను అంచనా వేయవచ్చు. సర్జరీ అనంతరం రోగి పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. రక్తనాళాలకు సంబంధించి డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడం ద్వారా కూడా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. సి.టి స్కాన్, యాంజియోగ్రఫీ, ఎమ్ఆర్ఎ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్ పరీక్షల ద్వారా కూడా వ్యాధిని గుర్తించవచ్చు.
చికిత్స
రక్తనాళాల్లో క్లాట్ ఎక్కువగా ఉండి మందులతో కరిగే అవకాశం లేనప్పుడు యాంజియోప్లాస్టీ చేయడం ద్వారా రక్తసరఫరాకు మార్గం సుగమం చేయవచ్చు. బెలూన్ సహాయంతో చేసే ఈ చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. కొందరిలో మందుల ద్వారానే క్లాట్స్ కరిగిపోయే అవకాశం ఉంది.
థ్రాంబోలైటిక్స్(క్లాట్‌బస్టర్స్)ను ఉపయోగించడం ద్వారా లేక చిన్న శస్త్రచికిత్సల ద్వారా క్లాట్స్‌ను తొలగించవచ్చు. ఒకవేళ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయి ఉంటే పెరిఫెరల్ వాస్క్యులర్ బైపాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్‌తో బాధపడే వారు శరీరంలో మిగతా భాగాల్లో ఎక్కడైనా క్లాట్స్ ఏర్పడుతున్నాయో చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా గుండె, మెదడుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. పీవీడీతో బాధపడుతున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి పూర్తి పరీక్షలు చేయించుకుని గుండె రక్తనాళాల్లో క్లాట్స్ ఉంటే గనుక వాటిని అదే సమయంలో తొలగించుకోవడం మంచిది. కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటే పాదాలను దిండుపై పెట్టి పడుకోవడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నివారణ
ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారినపడకుండా కాపాడుకోవచ్చు. తాజా కూరగాయలు, తక్కువ కొలెస్టరాల్ ఉండే ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నడక, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు, ట్రెడ్‌మిల్ ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా పీవీడీ రాకుండా చూసుకోవచ్చు.
స్మోకింగ్‌కూ దూరంగా ఉండటం, డయాబెటిస్ ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు పాదాలను పరీక్షించుకోవడం, గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవడం, వేడి నీళ్లను, బిగుతుగా ఉండే షూలను ఉపయోగించకుండా ఉండటం చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

No comments:

Post a Comment