మెల మెల్లగా చలికాలం పోయి ఎండాకాలం వస్తోంది. చలికాలంలో ఫుల్లుగా
లాగించినట్లే ఎండాకాలంలో లాగించేస్తాం అంటే కుదరదు. ఎందుకంటే వేడి
వాతావరణంలో జీర్ణప్రక్రియ భారంగా ఉంటుంది. అందుకే మీరు తిన్న ఆహారం ఈ
వేసవిలో సులువుగా జీర్ణం కావాలంటే వీటిని వాడండి...
అల్లం:
దీన్ని ఏ వంటలోకైనా శుభ్రంగా వేసుకోవచ్చు. మంచి రుచితోపాటు కమ్మటి సువాసన దీని సొంతం.
అల్లంలోని ఔషధగుణాలు జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తాయి. అల్లం వాడిన
పదార్థాలు తింటే రక్తనాళాలు ఉత్తేజితం అవుతాయి. పొద్దున్నే టీతోపాటు,
ఉప్మా, చట్నీ, కూరల్లో తాజా అల్లం ముక్కలు వేసుకోవడం మరవొద్దు.
సోంపు:
హోటళ్లు, ఫంక్షన్లలో భోజనం చేయగానే సోంపు వేసుకోవడం భారతీయ సంప్రదాయం.
సోంపు తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. సోంపు గింజల్లోని యాస్పర్టిక్
యాసిడ్ తిన్న ఆహారాన్ని వేగంగా ఎనర్జీగా మారుస్తుంది. వంటల్లో కూడా సోంపు
వాడకం మంచిది. జిలకర, వాము లాగే ఇదీ శరీరానికి మేలు చేస్తుంది.
పెరుగు:
వేసవిలో ఉదరసంబంధిత సమస్యలకు పెరుగు చల్లటి పరిష్కారం. కాస్త పెరుగైనా
అన్నంలోకి వేసుకొని కొద్దిగా నీళ్లు కలుపుకుని తినాలి. పెరుగులోని లాక్టోజ్
శరీరంలోని చెడు బ్యాక్టీరియాను తరిమేస్తుంది. దాంతో జీర్ణం సాఫీగా
అవుతుంది. వేసవిలో పెరుగుకు బదులు మజ్జిగ తీసుకున్నా మేలే.
మెంతులు:
ఒకప్పుడు వంటల్లో మెంతుల వాడకం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పప్పులో మెంతి
ఆకు కూర వాడుతున్నారు కానీ, మెంతిగింజల వాడకం తగ్గించారు. చింతకాయ పచ్చడిలో
మెంతుల్ని ఎక్కువగా ఉపయోగించేవారు. మెంతి ఉదరకోశ సమస్యలకు దివ్యౌషధం.
కూరలు, పచ్చళ్లలో మెంతులను వాడితే మంచిది.
పుదీనా:
ఎండాకాలంలో శరీరంలోని వేడిని తగ్గిస్తుంది పుదీనా. మజ్జిగ లేక నీళ్లలోకి
పుదీనా ఆకుల్ని వేసుకొని తాగితే మంచిది. లేదంటే, పుదీనా ఆకులతో పచ్చడి
చేసుకొని తినవచ్చు. ఫ్రిజ్‌లో పెడితే పదిరోజులైనా పచ్చదనం కోల్పోని ఈ
ఆకులను వంటల్లోకి వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. జీర్ణప్రక్రియ శరీరానికి
భారం కానివ్వకుండా పుదీనా కాపాడుతుంది.
బిర్యానీ ఆకులు:
సంస్కృతంలో తమళపత్ర, తెలుగులో బంగారు ఆకు, బిరింజి ఆకు, పలావ్ఆకుగా పిలిచే
బిర్యానీ ఆకులను ఎన్నో ఏళ్ల నుంచి ఆహారంలో వాడుతూ వస్తున్నారు. బిర్యానీ,
పలావ్‌లలోనే కాకుండా వాడదగ్గ ఇతర వంటకాల్లో కూడా వీటిని వేసుకోవచ్చు.
జీర్ణం త్వరగా కావడానికి సహాయ పడుతుంది.
రానున్న వేసవిలో ఇవన్నీ
వంటింట్లో అందుబాటులో ఉండేలా చూసుకోండి. వంటకాల్లో వీలైనప్పుడల్లా వాడటం
మరిచిపోకండి. జీర్ణవ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసుకోండి.
No comments:
Post a Comment