Friday, February 21, 2014

కొవ్వును తగ్గించే కొత్తిమీర

కొత్తిమీరను కూరల్లో కొంచెం వేస్తాం. కొన్నిసార్లు వేసినా, వేయకపోయినా ఒకటేనని అనుకుంటాం. అది కేవలం రుచికి, సువాసన కోసమే అనుకుంటే పొరబాటు. దానిని ఆహారంలో నిత్యం తీసుకోవడం వల్ల ఎంతో మేలు.
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. దానిలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక శక్తికి ఇతోధికంగా సాయపడతాయి. దాన్లోని డొడిసెనోల్‌ అనే పదార్థం పేగుల్లో ఏర్పడే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.
గ్లాసుడు నీళ్లు, మజ్జిగలో చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి మధ్యాహ్నం కానీ, రాత్రి పడుకొనే ముందు కానీ తీసుకుంటే... శరీరానికి విటమిన్‌ 'ఎ', 'బి1', 'బి2', 'సి', ఇనుము సమృద్ధిగా అందుతాయి. అవి శరీర నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.
అజీర్ణంతో బాధపడేవారు.. ఈ రసంలో, జీలకర్ర, నిమ్మరసం చిటికెడు ఉప్పు కలిపి పుచ్చుకుంటే మంచిది. గర్భిణులు రోజూ రెండు మూడు చెంచాల రసం... నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్ధకం వంటివి తగ్గుతాయి. పేగుపూత, కడుపులో మంట గలవారు కొత్తిమీరను పెరుగులో కలిపి తరచూ తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి.
నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలున్నవారు ఆకులను నమిలి మింగితే త్వరగా గుణం కనిపిస్తుంది. కామెర్లు వచ్చినపుడు పథ్యంగా దీన్ని కూరల్లో వేసి తీసుకొంటే త్వరగా కోలుకుంటారు.
కొత్తిమీరకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ధనియాలను చారులా కాచి తీసుకుంటే విరేచనాలు, జ్వర తీవ్రత తగ్గుతాయి. నెలసరి సమయంలో అధికంగా రుతుస్రావం అవుతుంటే ధనియాల కషాయాన్ని రోజుకి రెండుసార్లు పుచ్చుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది.

No comments:

Post a Comment